Earthquake: బంగ్లాదేశ్, కోల్‌కతాలో భూకంపం..

భయంతో ప్రజలు పరుగులు

Update: 2025-11-21 05:45 GMT

బంగ్లాదేశ్, కోల్‌కతాను భూప్రకంపనలు హడలెత్తించాయి. శుక్రవారం ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.7గా నమోదైంది. బంగ్లాదేశ్‌లోని నర్సింగ్‌డి నుంచి 14 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత శుక్రవారం ఉదయం కోల్‌కతా, తూర్పు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 10.08 గంటలకు బంగ్లాదేశ్‌లోని నర్సింగ్‌డికి పశ్చిమ-నైరుతి దిశలో 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఇక కోల్‌కతా, పరిసర ప్రాంతాల నివాసులకు స్వల్ప భూప్రకంపనలు సంభవించినట్లుగా తెలిపారు. ఫ్యాన్లు, గోడలు ఊగడం చూసినట్లు చెబుతున్నారు.

ఇక భూప్రకంపనలకు భయంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగస్థులు కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు. అమోమయం.. గందరగోళానికి గురయ్యారు.

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ్, ఉత్తర దినాజ్‌పూర్, కూచ్ బెహార్‌లతో సహా ఇతర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. గాయాలు అయినట్లుగా సమాచారం లేదని అధికారులు వెల్లడించారు.

ఇక గురువారం పాకిస్థాన్‌లో 3.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ భూకంపం 10 కి.మీ లోతులో సంభవించింది.

Tags:    

Similar News