Satyendar Jain: ఢిల్లీలోని జైన దేవాలయంలో సత్యేందర్ జైన్ దంపతుల ప్రత్యేక ప్రార్థనలు
సత్యేందర్ జైన్ కు షరతులపై బెయిల్ మంజూరు.;
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శుక్రవారం తీహార్ జైలు నుంచి బయటికి వచ్చారు. ఇవాళ ఆయన తన సతీమణితో కలిసి దేశ రాజధాని ఢిల్లీలోని సరస్వతి విహార్‌లోగల జైన దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ జైన్ దంపతులిద్దరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కాగా సత్యేందర్ జైన్ మానీలాండరింగ్ కేసులో 2022 మే 30న అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఈడీ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంటూ విచారణను ఎదుర్కొంటున్నారు. మధ్యలో అనారోగ్య కారణాలరీత్య సుప్రీంకోర్టు నుంచి తాత్కాలిక బెయిల్‌పై బయటికి వచ్చారు. అనంతరం మళ్లీ జైలుకు వెళ్లారు. రెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత శుక్రవారం ఢిల్లీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
సుదీర్ఘ దర్యాప్తు, ఎక్కువ కాలం విచారణ ఖైదీగా జైలులో ఉండటం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని జైన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ కంపెనీ లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు జైన్‌ను అరెస్ట్ చేశారు.
2015-16 సమయంలో జైన్ కంపెనీలకు షెల్ కంపెనీల నుంచి దాదాపు రూ.4.81 కోట్లు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. అనంతరం సత్యేందర్ జైన్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ జైన్‌ను అదుపులోకి తీసుకుంది.