Kasthuri: పరారీలో సినీనటి కస్తూరి..

గాలింపుకు ప్రత్యేక బృందం ఏర్పాటు;

Update: 2024-11-11 02:15 GMT

రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారంటూ నోరు పారేసుకున్న సినీనటి, బీజేపీ నాయకురాలు కస్తూరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసులు రంగంలోకి దింపారు. హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో ఇటీవల నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న కస్తూరి మాట్లాడుతూ తెలుగు జాతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులను పరోక్షంగా ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు కస్తూరిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కస్తూరికి సమన్లు ఇచ్చేందుకు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆమెకు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండడంతో ఆమె పరారీలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

ఈ వివాదం ఒకవైపు జరుగుతుండగానే ప్రభుత్వ ఉద్యోగుల్లో బ్రాహ్మణేతరులు లంచాలు తీసుకుంటున్నారని కస్తూరి మాట్లాడడాన్ని ఉద్యోగ సంఘాలు ఖండించాయి. ప్రభుత్వ ఉద్యోగులపై నోటికొచ్చినట్టు మాట్లాడడాన్ని తమిళనాడు రెవెన్యూ అధికారుల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. తమను కించ పరిచేలా మాట్లాడి తమ మనో భావాలను దెబ్బ తీసేలా మాట్లాడిన కస్తూరిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారుల సంగం కోరింది. ఈ నేపథ్యంలో ఆమెపై చెన్నైలోని పలు స్టేషన్స్ లో కేసులు నమోదు అయ్యయి. కస్తూరిపై నమోదయిన కేసుల్లో ఆమెను విచారించేందుకు చెన్నై పోలీసులు సమన్లు ​​జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ ఆమె ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందని విషయమై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కస్తూరి తమిళనాడు విడిచి వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

Tags:    

Similar News