VINAYAKA: 66 కిలోల బంగారం.. 325 కిలోల వెండితో గణనాథుడు
రూ. 400 కోట్లతో బీమా చేయించిన జీఎస్‌బీ సేవా మండల్... సోషల్ మీడియాలో వైరల్;
దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుడు విభిన్న రూపాల్లో కొలువుదీరాడు. బొజ్జ గణపయ్య కోసం ఊరూరా, వాడవాడలా అందమైన మండపాలను ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో లంబోదరుడి ప్రతిమలతో వీధులు కళకళలాడుతున్నాయి. ముంబైలో వినాయక వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గత ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా విఘ్నేషుడి ప్రతిమలు కొలువుదిరాయి. జీఎస్‌బీ సేవా మండల్ ‘మహాగణపతి’ ప్రతీసారిలాగె ఈసారి కూడా వైరల్‌గా మారింది. దేశంలోనే సంపన్న వినాయకుడిగా పేరొందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈ ఏడాది ఏకంగా రూ.400 కోట్లతో బీమా చేయించారు. ఇక్కడి విగ్రహాన్ని భారీఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించారు.
ముంబై శివారులోని మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్‌బీ సేవామండల్ వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈ మండపంలోని గణపయ్య విగ్రహాన్ని ఏకంగా 66 కిలోల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. ముందుజాగ్రత్తగా ఈ వేడుకలకు రూ.400.58 కోట్లతో బీమా చేయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. నేటినుంచి సెప్టెంబరు 11 వరకు ఐదు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. గతేడాది సైతం ఈ గణేశ్ మండపానికి రూ.360.40 కోట్లకు బీమా తీసుకున్నారు. భక్తులు, నిర్వాహకులకు ఇది వర్తిస్తుంది. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను కూడా నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటుచేశారు.
శుభాకాంక్షలు తెలిపిన చిరు
వినాయక చవితి పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరుడి కృపతో అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగి ఆనందం వెల్లివిరియాలని ప్రార్థిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !’ అని చిరు ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం చిరంజీవి, వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ మూవీలో నటిస్తున్నారు.