Air India: ప్రీమియం ఎకానమీ సీట్లతో ఎయిరిండియా కొత్త విమానం
త్వరలోనే A320neo సర్వీస్ ప్రారంభం;
ప్రీమియం ఎకానమీ సీట్లు అమర్చిన నారోబాడీ విమానమైన ఎ320 నియో, ఎయిరిండియాకు చేరింది. ఈ విమానంలో 8 విలాసవంత బిజినెస్ తరగతి సీట్లు, అదనపు లెగ్‌రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, సౌకర్యవంతమైన 132 ఎకానమీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత విమానాల డిజైన్‌కు భిన్నంగా, సరికొత్త లివరీతో ఈ విమానాన్ని తీర్చిదిద్దారు. ఫ్రాన్స్‌లోని ఎయిర్‌బస్ తయారీ ప్లాంటు నుంచి దిల్లీ విమానాశ్రయానికి ఈ విమానం ఆదివారమే చేరింది.
ప్రభుత్వ ఆధీనంలోని ఎయిరిండియా, టాటా గ్రూప్ ఆధీనంలోకి వచ్చాక.. విమానాల ఆధునికీకకరణ ప్రారంభమైంది. ఇప్పటికే ఉన్న విమానాల్లో సీట్లు సహా, ఇతర సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని, సరికొత్త విమానాలను సమకూర్చుకుంటున్నామని సంస్థ గతంలోనే ప్రకటించిన సంగతి విదితమే. ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని ఇచ్చేలా, ఇప్పుడు నారోబాడీ (వెడల్పు తక్కువగా ఉండే, మధ్యస్థాయి విమానం) లోనూ 3 తరగతుల సీట్లను అమర్చారు. దేశీయ మార్గాల్లో ఈ విమానాన్ని వచ్చే నెల నుంచి నడపనున్నారు. ఇప్పటికే ఎయిర్‌బస్ 320 నియో విమానాలు 3 ఎయిరిండియా దగ్గర ఉన్నా, అవన్నీ పాత డిజైన్ ప్రకారం రూపొందించినవే.