Air Pollution: ప్రాణాలు తీస్తున్న వాయుకాలుష్యం
వాయు కాలుష్యానికి ఐదేళ్లలోపు సుమారు 7 లక్షల మంది చిన్నారులు బలి..;
వాయుకాలుష్యం కారణంగా 2021లో ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్‌ఈఐ) సంస్థ వెలువరించిన తాజా నివేదికలో వెల్లడైంది. భారత్‌లో 21 లక్షలమంది మరణించినట్టు ఈ నివేదిక తెలిపింది. యునిసెఫ్‌తో కలిసి హెచ్‌ఈఐ ఈ పరిశోధన చేపట్టింది. దక్షిణ ఆసియాలో మరణాలకు వాయు కాలుష్యం ప్రధాన కారణంగా ఉన్నదని, తర్వాతి స్థానాల్లో అధిక రక్తపోటు, పొగాకు ఉన్నాయని తెలిపింది.
వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న ఓజోన్ కాలుష్యం 2021లో 5 లక్షల పైచిలుకు చిన్నారులను బలితీసుకుంది. గ్రీన్ హౌస్ వాయువు విడుదల తగ్గించాలని శాస్త్రవేత్తలు ఈ నివేదికలో తేల్చారు. ముఖ్యంగా ఇళ్లల్లో వంటకు బొగ్గు, చెక్కలాంటి ఇంధనాల వినియోగం తగ్గించాలని చెప్పింది. ఈ అంశంలో చైనా మంచి పురోగతి సాధించింది అని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.
కాగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల మంది బేసిక్ స్టవ్‌లు లేదా మంటలపై ఆహారం వండుతూ ప్రమాదకరమైన వాయువులను పీలుస్తున్నారు. అయితే, మరింత మెరుగైన స్టవ్‌లు, ఇంధనాలు అందుబాటులోకి రావడంతో 2020 నుంచి చిన్నారుల మరణాలు సగానికి పైగా తగ్గిపోయాయని వెల్లడించింది. దాదాపు 200 దేశాల్లోని పరిస్థితుల అధ్యయనం ఆధారంగా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఈ నివేదికను తయారు చేసింది. కాగా, ఈ ప్రమాదకర వంట విధానాల నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు 2.2 బిలియన్ డాలర్లు కేటాయించినట్టు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది.