Amarnath Yatra: కొండ చరియలు విరిగిపడి యాత్రకు బ్రేక్

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి దిగ్బంధం

Update: 2023-08-09 04:45 GMT

అమరినాథ్ యాత్రకు మరో చిన్న బ్రేక్ పడింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ అధికారులు చెప్పారు. పూర్తిగా పునరుద్దరణ జరిగే వరకు ప్రజలు జాతీయ రహదారి-44పై ప్రయాణించవద్దని జమ్మూకాశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడినందున పంత చౌక్ యాత్ర బేస్ క్యాంపు నుంచి జమ్మూకు వెళ్లాల్సిన అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జులై 1వతేదీన ప్రారంభించిన అమరనాథ్ యాత్ర ఆగస్టు 31వతేదీ వరకు కొనసాగనుంది. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా అమరనాథ్ యాత్ర మార్గంలో భారీభద్రత ఏర్పాటు చేశారు. భద్రతా బలగాలతోపాటు పూంచ్ సివిల్ సొసైటీ సభ్యుల సహకారంతో అమరనాథ్ యాత్ర శాంతియుతంగా ముగిసేలా చర్యలు తీసుకున్నామని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు.


ఇంతకు ముందే ఆగష్టు 5 న జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 ని రద్దు చేసి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా యాత్రను ఒకరోజు పాటు నిలిపివేశారు. ఇక ఐదు రోజుల కిందట ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై నందప్రయాగ్, చింకా సమీపంలోని రహదారిపై కూడా భారీగా కొండచరియలు విరిగిపోయాయి.ఈ శిథిలాలు రోడ్డుపై పేరుకుపోయాయి. దీంతో రహదారిని అధికారులు మూసివేశారు. అంతకు ముందు రోజు కూడా బద్రీనాథ్ జాతీయ రహదారిపై కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ దారిని కూడా అధికారులు మూసివేశారు. జూలై 1 నుంచి కొనసాగుతున్న ఈ యాత్రలో ఇప్పటికీ 4.5 లక్షలకు పైగా భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ యాత్ర ఆగస్టు 31తో ముగియనుంది.

Tags:    

Similar News