WEST BENGAL: బెంగాల్లో మణిపూర్‌ తరహా ఘటన.. మహిళలను వివస్త్రలుగా చేసి..

పశ్చిమబెంగాల్లో మణిపూర్‌ తరహా ఘటన జరిగిందన్న బీజేపీ... మహిళలను వివస్త్రలుగా చేసి కొడుతున్న వీడియో వైరల్‌... తిప్పికొట్టిన టీఎంసీ

Update: 2023-07-23 05:00 GMT

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన మరవకముందే పశ్చిమ బెంగాల్ (West Bengal) లోనూ అలాంటి ఘటనే వెలుగుచూడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన (Manipur) దేశం మొత్తాన్ని కదిలించింది. ఇప్పుడు అదే తరహా ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి చెప్పులతో కొడుతున్న వీడియోను బీజేపీ (BJP) ఐటీ సెల్‌ ఇన్‌ఛార్జి అమిత్‌ మాలవీయ ట్వీట్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో హింసా కొనసాగుతోందని... మాల్దాలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలుగా చేసి దారుణంగా హింసించారని బీజేపీ(BJP alleged) ఆరోపించింది. అక్కడే ఉన్న పోలీసులు చేష్టలుడిగి చూశారే తప్ప కనీసం అడ్డుకోలేదని.. ఈ దారుణం ఈనెల 19న జరిగిందని మాలవీయ ట్వీట్ చేశారు.

మాల్డా (Malda) లోని పకువాహాట్ లో దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు మహిళల్ని పట్టుకుని స్థానికులు చితకబాదారు. ఆపై అర్ధనగ్నంగా (Women Half Nake Parade) వీధుల్లో ఊరేగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాతే విషయం తెలిసిందన్నారు. బాధిత మహిళలు ఇద్దరూ దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బేజేపీ ఆరోపణలను అధికార తృణమూల్‌ (TMC) ప్రభుత్వం తిప్పికొట్టింది. ప్రజల దృష్టి మరల్చేందుకే భాజపా కొత్త నాటకానికి తెరతీసిందని ఆరోపించింది. అమిత్‌ మాలవీయ ఆరోపణలను పశ్చిమబెంగాల్‌ మంత్రి శశి పంజా ఖండించారు. మార్కెట్లో దొంగతనం చేశారన్న ఆరోపణలపై ఇద్దరు మహిళలపై స్థానికులు దాడి చేశారని చెప్పారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దర్యాప్తు జరుగుతోందని, త్వరలో అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని చెప్పారు.

బీజేపీ కావాలనే ఈ ఘటనపై రాజకీయం చేయాలనుకుంటోందని విమర్శించారు. ఈ ఘటనను కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌధరి తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన భాజపా అభ్యర్థినిని సైతం మణిపుర్‌ తరహాలో దుస్తులు విప్పి ఊరేగించారంటూ భాజపా ఎంపీ లాకెట్‌ ఛటర్జీ శుక్రవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో కన్నీటి పర్యంతమయ్యారు. ఆ మరుసటి రోజే బెంగాల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

Tags:    

Similar News