Amit Shah: ఇక IPC, CRPC స్థానంలో కొత్త చట్టాలు
లోక్‌సభలో బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం;
బ్రిటీష్ కాలంనాటి క్రిమినల్ చట్టాలకు కేంద్రం చరమగీతం పాడనుంది. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో మూడు కొత్త బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా బిల్లులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనకు పంపనున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన అమిత్ షా, రద్దు చేయనున్న ఈ మూడు చట్టాలు బ్రిటీష్ పాలనను కాపాడేందుకు, బలోపేతం చేయటానికి ఉద్దేశించినవని పేర్కొన్నారు. వాటి లక్ష్యం శిక్షించటమే తప్ప న్యాయం అందించటం కాదన్నారు. వాటి స్థానంలో తేనున్న మూడు కొత్త చట్టాలు భారత పౌరుల హక్కులను కాపాడే స్ఫూర్తితో తెస్తున్నట్లు తెలిపారు. మూడు కొత్త చట్టాల లక్ష్యం శిక్షించటం కాదని, న్యాయం అందించటమేనన్నారు. నేరాలను అరికట్టేందుకు మాత్రమే శిక్షలు వేయనున్నట్లు చెప్పారు.
అలాగే చట్టాల్లోని లొసుగులతో నేరగాళ్లు తప్పించుకోవడం ఇకపై కుదరదన్నారు. కొత్త చట్టాలతో 90 శాతంపైగా నేరగాళ్లకు శిక్షలు ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఏడేళ్లకు పైగా శిక్ష పడే కేసుల్లో ఫోరెన్సిక్ తనిఖీ తప్పని సరి చేస్తున్నామని వెల్లడించారు. క్రిమినల్ ప్రొసిజర్‌లో మొత్తం 313 మార్పులు చేశారు. ఈ బిల్లులు చట్టంగా మారితే గ్యాంగ్ రేప్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, మైనర్లను రేప్ చేస్తే మరణ శిక్ష, పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌లో వీడియోగ్రఫీ తప్పనిసరి, మూక దాడులకు ఏడేళ్ల జైలు శిక్షలు పడనున్నాయి.
దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటీష్ పాలకుల కాలంలో తీసుకువచ్చిన సీఆర్‌పీసీ, స్వాతంత్రం అనంతరం తెచ్చిన ఐపీసీ చట్టాల ప్రకారమే ఇప్పటివరకు నేరం చేసిన వారికి కోర్టులు శిక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలాసార్లు.. సుప్రీంకోర్టు సహా వివిధ హైకోర్టులు.. కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో చాలా మార్పులతో కొత్త చట్టాలను తీసుకువస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో వెల్లడించారు.