Delhi CM: రేఖా గుప్తా దాడి కేసులో మరో నిందితుడు అరెస్ట్.. అసలు ప్లాన్ ఎంతంటే ..

విచారణలో కీలక విషయాలు రాబట్టిన పోలీసులు..;

Update: 2025-08-25 02:00 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి కేసులో మరొక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తహసీన్ సయ్యద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అదుపులోకి తీసుకున్నారు. తహసీన్ సయ్యద్.. ప్రధాన నిందితుడు సకారియా రాజేష్‌భాయ్ ఖిమ్జీ(41) స్నేహితుడిగా గుర్తించారు.

ఇక ప్రధాన నిందితుడు సకారియాను న్యాయస్థానం ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. దీంతో అతడి నుంచి అనేక విషయాలను పోలీసులు రాబడుతున్నారు. గత బుధవారం ముఖ్యమంత్రి నివాసంలో రేఖా గుప్తాపై సకారియా దాడి చేశాడు. అయితే నిందితుడి వెనుక సయ్యద్ హస్తం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడికి సయ్యద్ రూ.2,000 పంపినట్లుగా కనుగొన్నారు. అంత మాత్రమే కాకుండా నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నట్లుగా గుర్తించారు. సకారియా వృత్తిరీత్యా ఆటోరిక్షా డ్రైవర్. 2017 నుంచి 2024 వరకు రాజ్‌కోట్‌లోని భక్తినగర్ పోలీస్ స్టేషన్‌లో ఐదు దాడి కేసులు, మద్యం కేసులతో పాటు పలు కేసులు ఉన్నాయి. గుజరాత్ నిషేధ చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద 2017, 2020, 2022లో రెండు సార్లు చర్యలు కూడా తీసుకున్నారు. 2021లో బాంబే పోలీస్ చట్టంలోని సెక్షన్ 56 కింద సకారియాను బహిష్కరించారు.

ఇక 2017లో సకారియా ఒక వ్యక్తి తలపై బ్యాట్‌తో కొట్టాడు. అంతేకాకుండా 2022లో భార్యతో గొడవ పడి కుటుంబ సభ్యులందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. ఆ సమయంలో బ్లేడ్‌తో తన తలపై దాడి చేసుకోవడంతో తొమ్మిది కుట్లు పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు మొబైల్‌లోని సమాచారం, అతడి స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మరింత సమాచారాన్ని సేకరించారు.

అవినీతి అంశంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన చేసినట్లే వీధి కుక్కలను తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నిరసన చేపట్టాలని సకారియా యోచిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇక నిందితుడి మొబైల్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? లేదంటే దాచి పెట్టాడా? అన్న విషయాలను లోతుగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నాడు.

Tags:    

Similar News