మద్యం పాలసీకి సంబంధించి అవినీతి ఆరోపణల కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ అభ్యర్థనపై విచారణ జరిపిన ప్రత్యేక జడ్జి అమితాబ్ రావత్.. కేజ్రీవాల్‌ను మూడు రోజుల కస్టడీకి అప్పగించారు.
కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా కేజ్రీవాల్ స్వయంగా వాదనలు వినిపిస్తూ తాను నిర్దోషినని తెలిపారు. మద్యం కుంభకోణం తప్పిదమంతా మనీశ్ సిసోదియాదేనని తాను తెలిపినట్లుగా మీడియాలో సీబీఐ వర్గాలను ఉటంకిస్తూ ప్రధాన శీర్షికలతో కథనాలు వచ్చాయని, తాను అలాంటి వాంగ్మూలం ఏదీ ఇవ్వలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తమను అప్రతిష్ఠపాల్జేయాలన్న కుట్రను మీడియా ద్వారా సీబీఐ అమలుచేస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ వాదనలను సీబీఐ తోసిపుచ్చింది.
మద్యం కుంభకోణంలోని విస్తృతమైన కుట్రను ఛేదించడానికి గాను కేజ్రీవాల్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది. కేజ్రీవాల్‌ను ఇప్పుడే ఎందుకు అరెస్టు చేస్తున్నారని దర్యాప్తు సంస్థను జడ్జి ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు విషయాన్ని న్యాయస్థానం పరిశీలించిందని, అందువల్ల ఇప్పటి వరకు సంయమనం పాటించినట్లు సీబీఐ తరఫు న్యాయవాది బదులిచ్చారు. అధికార వ్యవస్థల దుర్వినియోగానికి మద్యం కేసు నిదర్శనమని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై దిల్లీ హైకోర్టు మధ్యంతర స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ బుధవారం ఉపసంహరించుకున్నారు. బెయిల్ అమలు నిలుపుదలపై హైకోర్టు మంగళవారం పూర్తిస్థాయి ఆదేశాలు ఇవ్వడం, సీబీఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో సమగ్ర పిటిషన్‌ను దాఖలు చేస్తామని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి న్యాయస్థానానికి తెలిపారు. జస్టిస్ మనోజ్ మిశ్ర, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్‌తో కూడిన సెలవుకాల ధర్మాసనం అందుకు అనుమతించింది.
తన భర్త జైలు నుంచి బయటకు రాకుండా మొత్తం వ్యవస్థ ప్రయత్నిస్తున్నదని కేజ్రీవాల్ భార్య సునీత ఆరోపించారు. ఇది నియంతృత్వం, ఎమర్జెన్సీతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, అయితే దీనిపై ఈడీ వెంటనే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొన్నదని అన్నారు. ‘ఇది చట్టం కాదు. ఇది ఒక నియంతృత్వం, ఇది ఎమర్జెన్సీ’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.