Milk bath: విడాకులు వచ్చాయనే సంబరంతో పాలతో స్నానం చేసిన యువకుడు..
ఆనందం తట్టుకోలేక ..;
గత కొద్దికాలంగా భార్యభర్తల బంధాలకు సంబంధించిన అనేక ఘటనలు సంచనాలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. భార్యతో విడాకులు తీసుకున్న సంతోషాన్ని వ్యక్తం చేసేందుకు పాలతో స్నానం చేసిన వ్యక్తి గురించి ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అస్సాంలోని నల్బరీ జిల్లా బరలియాపర్ గ్రామానికి చెందిన మాణిక్ అలీ అనే వ్యక్తి, భార్యతో చట్టబద్ధంగా విడాకులు పొందిన తర్వాత చేసిన ఈ వినూత్న పని ఎంతో మందిని ఆకట్టుకుంటోంది.
వివాహం తర్వాత ఓ కుమారుడు పుట్టినప్పటికీ.. భార్య రెండుసార్లు తన ప్రియుడితో పారిపోయిందని మాణిక్ అలీ తెలిపారు. ఈ పరిణామాలన్నీ తమ కుటుంబానికి తీవ్ర మానసిక ఒత్తిడిని తెచ్చిపెట్టాయని అన్నారు. అయినా పిల్లవాడి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని భార్యను తిరిగి ఇంటికి తీసుకురాగా, మార్పు ఏమీ కనిపించకపోవడంతో చివరకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. విడాకుల పత్రాలు చేతికి వచ్చిన వెంటనే మాణిక్ అలీ ఆనందం తట్టుకోలేకపోయారు.
అలా విడాకుల పత్రాలు తీసుకొని ఇంటికి చేరిన వెంటనే 40 లీటర్ల తాజా పాలను తెప్పించి వాటితో స్నానం చేశాడు. ఆ స్నానం తర్వాత అతను మాట్లాడుతూ.. “ఈ రోజు నుంచి నేను స్వేచ్ఛా జీవిని. ఇది నా కొత్త పుట్టుక” అని అన్నాడు. తన గతాన్ని పూర్తిగా వెనక్కి నెట్టి, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు పాల స్నానాన్ని చేశానని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక చాలామంది మాణిక్ అలీ తీర్మానాన్ని అభినందిస్తూ.. ‘నువ్వు బతికిపోయావ్..’ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే.. చాలా మంచి పనిచేసావ్ అంటూ అతని ప్రశంసిస్తున్నారు. అయితే మరికొందరు, ఇంత పెద్ద మొత్తంలో పాలను వృథా చేయడం సరైంది కాదని విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ సంఘటన ప్రస్తుతం అస్సాంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతమైన తండ్రిగా తన కుమారుడి భవిష్యత్ కోసం తాను చేసిన త్యాగాన్ని, చివరకు స్వేచ్ఛగా ఉండేందుకు తీసుకున్న తీర్మానాన్ని మాణిక్ అలీ వినూత్నంగా ప్రదర్శించాడు.