Atishi Marlena: ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ
ఢిల్లీ మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రి అతిశీ;
దిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్‌ఆద్మీ పార్టీ నేత, మంత్రి ఆతిశీ ఎన్నికయ్యారు. ఈమేరకు ఆప్ శాసనసభాపక్ష నేతలు మంగళవారం సమావేశయ్యారు. ఇందులో కొత్త సీఎంగా ఆతిశీ పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుతం ఆతిశీ ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
దిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు తనకు సర్టిఫికెట్ ఇచ్చేంతవరకూ ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని స్పష్టంచేశారు. సీఎం కుర్చీ నుంచి దిగిపోయి.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లి ప్రజల్లో తన విశ్వసనీయతను పరీక్షించుకుంటానని ప్రకటించారు. మద్యం విధానానికి సంబంధించిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ గతవారమే తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు.
ఈ క్రమంలోనే నేడు కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈమేరకు లెఫ్టనెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను కలిసేందుకు ఆయన అపాయింట్‌మెంట్ కోరగా సాయంత్రం 4.30 గంటలకు సమయం కేటాయించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కేజ్రీవాల్ రాజీనామాను ఎల్జీ ఆమోదించిన తర్వాత.. కొత్త సీఎంగా ఆతిశీ పేరును ఆప్ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు సమర్పించనున్నారు.
సెప్టెంబరు 26-27 తేదీల్లో దిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లోనే ఆతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి డిప్యూటీ సీఎంగా ఎవరినీ ప్రకటించే అవకాశాలు లేవని తెలుస్తోంది.
దిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే నవంబరులోనే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండు చేస్తున్నారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం ముందస్తుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఈసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.