Delhi Car Blast:ఉగ్రవాది డానిష్ ఫోన్‌లో బయటపడ్డ డ్రోన్ ఫోటోలు, వీడియోలు

హమాస్ తరహా దాడులకు ప్లాన్..

Update: 2025-12-02 07:30 GMT

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తులో  తాజాగా, సహ- నిందితుడు ఫోన్‌లోని డ్రోన్ ఫోటోలు.. హమాస్ తరహా ఆయుధాల ఆధారాలను బయటపెట్టాయి. జమ్మూ కశ్మీర్‌‌లోని అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన జాసిర్ బిలాల్ వనీ అలియాస్ డానిష్.. తన ఫోన్‌లోని హమాస్ తరహా ఆయుధ డ్రోన్ల వాడకానికి సంబంధించిన ఆధారాలను డిలీట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డానిష్ ఫోన్ నుంచి డ్రోన్ ఫోటోలను స్వాధీనం చేసుకుంది. ఈ ఫోటోలు హమాస్ వాడే డ్రోన్ల తరహాలోనే ఉన్నాయని ఎన్ఐఏ గుర్తించింది. ఈ డ్రోన్ల ద్వారా పేలుళ్లకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. 

డానిష్ ఫోన్‌ నుంచి తొలగించిన ఫోల్డర్‌లో డ్రోన్లు, రాకెట్ లాంచర్లకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు ఉన్నాయని అధికారులు తెలిపారు. డ్రోన్లలో పేలుడు పదార్థాలను ఎలా అమర్చాలో తెలిపే వీడియోలు కూడా లభించాయి. వీటిని ఒక యాప్ ద్వారా తన సహచరులకు డానిష్ పంపినట్లు సమాచారం. ఈ యాప్‌లో కొన్ని విదేశీ నంబర్లు కూడా ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల అధునాతన డ్రోన్ల తయారీకి ఉగ్రవాదులు ప్రయత్నించినట్లు గుర్తించింది. హమాస్ ఉపయోగించే గ్లైడింగ్ రాకెట్ల తరహా రాకెట్లను కూడా వీరు అధ్యయనం చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌ హస్తం ఉన్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే.

ఇండొవింగ్స్ సీఈఓ పరాస్ జైన్ ప్రకారం.. ఈ రాకెట్లను ఉపరితలం నుంచి లేదా చేతితోనూ ప్రయోగించవచ్చు. ఇవి గైడెడ్ మిస్సైల్స్‌కు తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయాలు. 20 సెకన్లకు ఒకటి చొప్పున నిమిషంలో మూడు రాకెట్లను ప్రయోగించవచ్చని ఆయన తెలిపారు. హమాస్ వీటిని పెద్ద సంఖ్యలో ఉపయోగిస్తుందని, ఎందుకంటే ఇవి విస్తృత ప్రాంతాన్ని ప్రభావితం చేసి, వేగంగా నష్టాన్ని కలిగిస్తాయని ఆయన చెప్పారు.

ఇంతకీ డానిష్ ఎవరంటే ? 

డానిష్ డ్రోన్ నిపుణుడు. డ్రోన్లు, రాకెట్లను తయారు చేయడంలో మంచి పట్టు ఉంది. కెమెరాలతో పాటు బరువైన బాంబులను మోసుకెళ్లగల పెద్ద బ్యాటరీలతో అమర్చబడిన శక్తివంతమైన డ్రోన్‌లను తయారు చేయగల సామర్థ్యం ఉన్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. చిన్న, ఆయుధరహిత డ్రోన్‌లను తయారు చేయడంలో మంచి అనుభవం ఉందని తెలిపారు. నవంబర్ 17న శ్రీనగర్‌లో డానిష్‌ను అరెస్టు చేశారు. డాక్టర్ ఉమర్‌తో కలిసి డానిష్ మారణహోమాన్ని సృష్టించాలని ప్లాన్ చేసినట్లుగా అధికారులు కనిపెట్టారు. అల్-ఫలాహ్ యూనివర్సిటీకి డానిష్ పలుమార్లు వచ్చి మాస్టర్ ప్లాన్ వివరించినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News