BANGLA: భారత్ సాయాన్ని తుడిచేసిన బంగ్లాదేశ్
పాఠ్యపుస్తకాల నుంచి భారత పోరాటం తొలగింపు... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు;
పాఠ్యపుస్తకాల నుంచి భారత పోరాటం తొలగింపు... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు బంగ్లా సర్కార్ ప్రభుత్వ పాఠశాలల పాఠ్యపుస్తకాల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమంలో భారత్ పాత్రకు సంబంధించి 5వ తరగతి పుస్తకాల్లో ఓ పాఠం ఉంది. ఈ పాఠంలో పాకిస్తాన్ లొంగుబాటు పత్రాన్ని భారత సైన్యాధికారికి అందిస్తున్నట్టు ఉన్న ఫొటోను తొలగించారు. ఆరో తరగతి ఇంగ్లిష్ పుస్తకంలో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, బంగ్లా ప్రధాని ముజిబ్ ఉర్ రెహ్మాన్ కలిసున్న ఫొటోను తొలగించారు. అంతేకాకుండా షేక్ హసీనాకు సంబంధించిన అన్ని చిత్రాలు, అధ్యాయాలను పాఠ్య పుస్తకాల నుంచి పూర్తిగా తొలగించారు. ఈ మార్పులను నేషనల్ కరికులం అండ్ టెక్స్ట్‌బుక్ బోర్డ్ చేసింది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక పాఠశాలలకు చెందిన 441 పుస్తకాలలో ఈ విధమైన మార్పులు చేశారు. 40 కోట్లకు పైగా కొత్త పుస్తకాలు ఇప్పటికే ముద్రితమయ్యాయి.
తుడిచేస్తే పోతుందా..?
డిసెంబర్ 1971లో భారత్, బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పాటయ్యింది. దీనిని వివరిస్తూ అయిదో తరగతి పాఠ్య పుస్తకంలో ఒక అధ్యాయం ఉంది. దీనిలో ఒక చారిత్రక ఛాయాచిత్రం ఉంది. చిత్రంలో పాకిస్తాన్.. భారత్‌కు లొంగిపోవడాన్ని చూపుతుంది. పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ తమ లొంగుబాటు పత్రాన్ని భారత సైన్యం లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరాకు అందిస్తున్నట్లుంది. అయితే ఈ ఫోటోను ఇప్పుడు పాఠ్య పుస్తకాల నుంచి తొలగించారు.