Bank Manager Fraud: తాకట్టు పెట్టిన 25 కిలోల బంగారంతో పరారైన బ్యాంక్ మేనేజర్
అసలు స్థానంలో నకిలీ, బ్యాంకుకు దాదాపు రూ. 17 కోట్ల నష్టం;
తాకట్టు పెట్టిన 25 కిలోల బంగారంతో బ్యాంక్ మేనేజర్ పరారైన ఘటన కేరళలో జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచిలో సుమారు 17 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని బ్యాంక్ మేనేజర్ మధు జయకుమార్ అపహరించాడు. ప్రస్తుత మేనేజర్ ఇర్షాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడకర పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మధు జయకర్ 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు మేనేజర్‌గా పనిచేసి కొచ్చి బ్రాంచికి బదిలీ అయ్యారు. అయితే అతను ఆ బ్రాంచిలో జాయిన్ కాలేదు. తాకట్టులో ఉన్న బంగారం స్థానంలో నకిలీ నగలు ఉన్నట్టు కొత్తగా వచ్చిన మేనేజర్ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కొత్తగా బ్యాంకుకు వచ్చిన మేనేజర్ ఫిర్యాదు మేరకు కేరళలోని కోజికోడ్ జిల్లాలోని వడకర పోలీసులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచ్ మాజీ బ్రాంచ్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. కొత్త మేనేజర్ ఇర్షాద్ తాకట్టు పెట్టిన బంగారాన్ని చూసే సరికి ఏదో తప్పు జరిగినట్లు అక్కడ గుర్తించారు. తాకట్టు పెట్టిన బంగారంలో నకిలీ బంగారం బయటపడింది. తదుపరి విచారణలో పెద్ద కుంభకోణం జరిగిందని తేలడంతో ఇర్షాద్ పోలీసులను ఆశ్రయించాడు..
దింతో బ్యాంకుకు దాదాపు రూ. 17 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జయకుమార్ మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో అతని ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఇంత పెద్ద మోసం ఒక్క వ్యక్తి ద్వారా ఎలా సాధ్యమైందని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వడకర శాఖలోని ఉద్యోగులందరి వాంగ్మూలాలను పోలీసులు త్వరలో నమోదు చేయనున్నారు.