Bombay High court: హిజాబ్ నిషేధంపై జోక్యం చేసుకోలేం: బాంబే హైకోర్టు
అది ప్రాథమిక హక్కు కాదన్న బాంబే హైకోర్టు;
విద్యార్థినుల బురఖా, హిజాబ్ ధారణపై బాంబే హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. బురఖా, హిజాబ్‌లపై ఒక విద్యాసంస్థ విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు సమర్థిస్తూ, అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎంతమాత్రం కాదని స్పష్టం చేసింది. ఒక విద్యా సంస్థను క్రమశిక్షణతో నిర్వహించడంలో భాగంగా విధించిన డ్రెస్ కోడ్ అమలు చేయడం కాలేజీ ప్రాథమిక హక్కు అని డివిజన్ బెంచ్ జస్టిస్‌లు ఏఎస్ చందూర్కర్, రాజేశ్ పాటిల్ బుధవారం తీర్పు చెప్పారు. కాలేజీ విధించిన డ్రెస్ కోడ్‌ను కులం, మతంతో సంబంధం లేకుండా అందరి విద్యార్థులకు అమలు చేయాల్సిందేనని పేర్కొంది.
ముంబయి కళాశాలలో డిగ్రీ చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థినులు హిజాబ్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని పరిశీలించిన న్యాయమూర్తులు ఏఎస్ చందూర్కర్, రాజేశ్ పాటిల్‌తో కూడిన డివిజన్ బెంచ్ హిజాబ్ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని.. వారి పిటిషన్‌ను కొట్టివేసింది. కళాశాల ఆవరణలో హిజాబ్, నఖాబ్, బుర్ఖా, స్టోల్స్, టోపీలు, బ్యాడ్జీలు ధరించరాదని యజమాన్యం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సదరు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది అల్తాఫ్ ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ఇస్లాంలో హిజాబ్ ధరించడం అత్యంత ముఖ్యమైన అంశమని, ఇది వారి మత స్వేచ్ఛ కిందకు వస్తుందని పేర్కొన్నారు. కళాశాల యజమాన్యం తరఫు న్యాయవాది అనిల్ అంతూర్కర్ వాదనలు వినిపిస్తూ.. అన్ని మతాలకు చెందిన విద్యార్థులకు ఒకే విధమైన డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు తీర్పునిచ్చింది.