Kanhaiyalal Khatik: చిత్తోర్‌గఢ్ 'గోల్డ్‌మ్యాన్‌'కు గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు..

రూ.5 కోట్లు ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక

Update: 2025-11-28 06:30 GMT

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో 'బప్పి లహరి', 'గోల్డ్‌మ్యాన్‌'గా పేరుగాంచిన పండ్ల వ్యాపారి కన్హయ్య లాల్ ఖటిక్‌కు గ్యాంగ్‌స్టర్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. తనకు గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ముఠాతో సంబంధం ఉందని చెప్పుకున్న ఓ వ్యక్తి, రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు కన్హయ్య లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు చెల్లించకపోతే "బంగారం ధరించే స్థితిలో ఉండవు" అని హెచ్చరించినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల క్రితం కన్హయ్య లాల్‌కు ఓ గుర్తుతెలియని నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఆ తర్వాత అదే నంబర్ నుంచి వాట్సాప్ కాల్ రాగా ఆయన సమాధానం ఇవ్వలేదు. దీంతో రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ ఓ ఆడియో రికార్డింగ్‌ను ఆయన ఫోన్‌కు పంపారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా సైలెంట్‌గా సెటిల్ చేసుకోవాలని కూడా సూచించారు. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసి అదే డిమాండ్ చేయ‌డంతో ఆయన సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

50 ఏళ్ల కన్హయ్య లాల్ ఒకప్పుడు తోపుడు బండిపై కూరగాయలు అమ్మి జీవించేవారు. ఆ తర్వాత యాపిల్ వ్యాపారంలోకి అడుగుపెట్టి బాగా సంపాదించారు. బంగారు ఆభరణాలపై మక్కువతో సుమారు 3.5 కిలోల బంగారం ధరిస్తుండటంతో స్థానికులు ఆయన్ను 'గోల్డ్‌మ్యాన్‌' అని పిలుస్తుంటారు.

బికనీర్‌కు చెందిన రోహిత్ గోదారా ప్రస్తుతం కెనడాలో ఉన్నట్లు భావిస్తున్నారు. అతనిపై భారత్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో 32కు పైగా కేసులు ఉన్నాయి. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా, గ్యాంగ్‌స్టర్ రాజు థెహత్ హత్య కేసుల్లో ఇతను ప్రధాన నిందితుడు. 2022లో 'పవన్ కుమార్' అనే నకిలీ పాస్‌పోర్ట్‌తో దుబాయ్‌కి పారిపోయాడు. ఇతనిపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ కూడా జారీ అయింది.

Tags:    

Similar News