Kolkata: హర్భజన్ సింగ్ పోస్ట్‌పై గవర్నర్ స్పందన
అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాజ్ భవన్ కు ఆదేశం;
కోల్ కతా వైద్యురాలి మృతి యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది. ఇదే అంశంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీకి రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు. వైద్యురాలిపై జరిగిన ఘటన గురించి మాట్లాడేందుకు నోట మాట రావడం లేదు. ఆ ఘటన ఒక్క నన్నే కాదు.. అందరినీ షాక్ నకు గురిచేసింది. ఇది ఒక మహిళలపై జరిగిన హేయనీయమైన చర్య. దీంతో సమాజంలో మిగతా మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి ఘటన తరువాత మన వ్యవస్థలో ఉన్నలోటుపాట్లను సరిచేయాల్సిన అవసరం ఉంది.. ఇదే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుందని లేఖలో హర్భజన్ సింగ్ పేర్కొన్నారు.
ఘటన జరిగి వారం రోజులు అవుతున్న ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైద్యులు, సిబ్బంది రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తోన్నా పట్టించుకోవడం లేదని హర్భజన్ సింగ్ మండిపడ్డారు. నేరస్థుడికి త్వరగా శిక్ష పడితే బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరుతుందంటూ పేర్కొంటూ రాసిన లేఖను సోషల్ మీడియాలోని తన ఎక్స్ ఖాతా హర్భజన్ సింగ్ షేర్ చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ లను ట్యాగ్ చేశారు. హర్భజన్ సింగ్ పోస్టు కు బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ స్పందించారు. ఈ మేరకు కోల్ కతాలోని రాజ్ భవన్ ఎక్స్ వేదికగా విషయాన్ని తెలిపింది.
హర్భజన్ సింగ్ లేఖ అనంతరం వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో తీసుకున్న చర్యలను తెలియజేయడానికి గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాష్ట్రంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాజ్ భవన్ మీడియా సెల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్న వివరాల ప్రకారం.. హర్భజన్ సింగ్ రాసిన లేఖపై హెచ్ జీ (గౌరవనీయ గవర్నర్) వేగంగా స్పందించారు. వివిధ సంఘాల ప్రతినిధులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటన విషయంలో తీసుకున్న చర్య గురించి వారికి తెలియజేయడానికి, ఈ విషయంలో వారి అభిప్రాయాలను తీసుకుంటారు.