Israel Palestine Conflict: గాజాకు, పాలస్తీనాకు మద్దతు ఇస్తామన్న బెంగాల్ మంత్రి
చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం అంటూ వ్యాఖ్యలు;
ఎక్కడ చూసినా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన చర్చలే.. పలు దేశాలు సైతం ఈ యుద్ధంలో తమ మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జమియత్-ఎ-ఉలేమా పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు మౌలానా సిద్ధిఖుల్లా చౌదరి పెద్ద ప్రకటనే చేశారు. గాజా, పాలస్తీనా ప్రజలకు ఆయన తన బహిరంగ మద్దతు ప్రకటించారు. వారికి అండగా ఉంటామని, వారికి ఏం అవసరం ఉన్నా ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఈ సందర్భంగా మౌలానా సిద్ధిఖుల్లా చౌదరి మాట్లాడుతూ.. ‘‘ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదు. యుద్ధం ద్వారా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. చర్చల ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది. మేము గాజాకు, పాలస్తీనాకు మద్దతుగా నిలబడతాము. వారికి ఏది అవసరమో దానిని ఏర్పాటు చేస్తాము. వారికి అన్నీ అందజేస్తాం’’ అని అన్నారు. మౌలానా సిద్ధిఖుల్లా చౌదరి పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాస్ ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ అండ్ లైబ్రరీ సర్వీసెస్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు.
పాలస్తీనా భూములు, ఆస్తులు లాక్కుంటున్నారని, వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని సిద్ధిఖుల్లా చౌదరి అన్నారు. గాజా, పాలస్తీనాకు జరుగుతున్న ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడతామని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్‌కు భారత ప్రభుత్వ మద్దతు, గాజా-పాలస్తీనాకు వ్యతిరేకంగా దాని విధానాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పాలస్తీనాను వ్యతిరేకిస్తూనే ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌పై ప్రశంసలు కురిపించారని ఆయన అన్నారు.
నిజానికి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఇజ్రాయెల్ కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగాల్ మంత్రి మౌలానా సిద్ధిఖుల్లా అందుకు పరోక్షంగా పాలస్తీనాకు మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది. కానీ ఉత్తరప్రదేశ్ ఇందుకు పూర్తీ భిన్నమైన పరిస్థితి . అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ ఇప్పటికే తమ నిర్ణయం ప్రకటించారు. ఈ యుద్ధంపై ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుందని, ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకోవాలంటూ ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్‌మీడియాలో ఈ అంశంపై వ్యాఖ్యానించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై భారత ప్రభుత్వ అభిప్రాయాలకు విరుద్ధంగా ఎలాంటి కార్యకలాపాలను రాష్ట్రంలో అంగీకరించబోమని యోగి హెచ్చరించారు.