Bangalore Restaurants: రేపటి నుంచి బెంగళూరులో రెస్టారెంట్ల మూసివేత!

కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా ..

Update: 2026-03-10 00:45 GMT

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం బెంగళూరులోని రెస్టారెంట్లపై తీవ్రంగా పడింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరా హఠాత్తుగా నిలిచిపోయిందని, దీంతో రేపటి నుంచి నగర వ్యాప్తంగా హోటళ్లను మూసివేస్తామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ పేర్కొంది. తీవ్ర కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా రేపటి నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను నిర్వహించలేమని ఆ ప్రకటనలో తెలిపింది.

గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో 70 రోజుల వరకు గ్యాస్ సరఫరాకు గ్యాస్ కంపెనీలు హామీ ఇచ్చాయని, కానీ అందుకు విరుద్ధంగా గ్యాస్ సరఫరా చేయడం లేదని ఆ ప్రకటనలో తెలిపింది. అందుకే ఈ నెల 10వ తేదీ నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేస్తున్నట్లు పేర్కొంది.

బెంగుళూరులో సుమారు 35 వేలకుపైగా చిన్నా పెద్దా హోటళ్లు ఉన్నాయి. అయితే నిన్నటి నుంచి చాలా హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో ఆహార తయారీ పూర్తిగా ప్రభావితమైంది. దీంతో హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బెంగుళూరు హోటల్ అసోసియేషన్ రేపు హోటళ్లు బంద్ చేయాలని పిలుపునిచ్చింది. కమర్షియల్ గ్యాస్ అందకపోతే హోటళ్లను నిర్వహించడం అసాధ్యమవుతుందని వారు తెలిపారు. అందువల్ల గ్యాస్ సరఫరా పునరుద్ధరించే వరకు చాలా హోటళ్లు తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని అసోసియేషన్ పేర్కొంది. అయితే గ్యాస్ సరఫరాను వెంటనే పునఃప్రారంభిస్తే హోటళ్లు మునుపటిలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయని హోటల్ అసోసియేషన్ తెలిపింది. గ్యాస్ కంపెనీలు త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని హోటల్ యజమానులు కోరుతున్నారు.

Tags:    

Similar News