Mobile App Vote: మొబైల్ నుంచే ఓటింగ్..దేశంలోనే తొలిసారిగా బీహార్‌లో అమలు

పోలింగ్‌ బూత్‌కు వెళ్లలేని వాళ్ల కోసం ఈ కొత్త ఓటింగ్ సౌకర్యం;

Update: 2025-06-28 01:28 GMT

కొద్ది రోజుల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో భారత ఎన్నికల సంఘం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని ఆరు మున్సిపల్‌ కౌన్సిళ్లకు జరిగే ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా ఓటర్లు మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో మొబైల్‌ ఫోన్ల ద్వారా ఓటు వేయవచ్చునని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ దీపక్‌ ప్రసాద్‌ తెలిపారు. అయితే ఇదే విధానాన్ని వచ్చే అసెంబీ ఎన్నికల్లో కూడా ఉపయోగించేదీ లేనిదీ ఆయన వివరించ లేదు.

పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయలేని వారు మొబైల్‌ ద్వారా ఓటువేసే సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని చెప్పారు. ఈ విధానం ట్యాంపర్‌ ప్రూప్‌ అని చెప్పారు. అయితే ఆన్‌లైన్‌ ద్వారా ఓటు వేయాలనుకునే వారు తమ మొబైల్‌లో ఒక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయాల్సి ఉందన్నారు. ఈ సదుపాయాన్ని వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, వలస కార్మికులు పొందవచ్చునని తెలిపారు. అయితే ఇది ఆండ్రాయిడ్‌ ఫోన్లకే పనిచేస్తుందన్నారు. 10 వేల మంది ఇప్పటికే నమోదు చేసుకున్నారని, ఈ ఎన్నికల్లో 50 వేల మంది ఆన్‌లైన్‌ ద్వారా ఓటు వేస్తారని భావిస్తున్నట్టు చెప్పారు.ఫేస్ మ్యాచ్, బ్లాక్‌ చేయిన్ ప్లాట్‌ఫామ్, స్కానింగ్‌ లాంటి సిస్టమ్‌లతో కూడిన మొబైల్‌ యాప్ ద్వారా ఓటింగ్ విధానం ట్యాంపర్‌ ప్రూఫ్‌గా పనిచేస్తుందని వెల్లడించారు. ఇక త్వరలో జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మరి ఈ ఎన్నికలకు కూడా మొబైల్ ఫోన్‌ యాప్‌ ద్వారా ఓటు వేసేందుకు పర్మిషన్ ఇస్తారా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు.  


Tags:    

Similar News