Seized Liquor: బంగాళదుంపల బస్తాల్లో మద్యం అక్రమ తరలింపు
రూ.30 లక్షల మద్యం స్వాధీనం;
బిహార్‌లో ముజఫర్‌పూర్ పోలీస్ విభాగం మద్యం మాఫియాలపై భారీ చర్యలు చేపట్టింది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం మాఫియాలు పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు వారి అక్రమ మద్యం రవాణాను నివారించారు. పంజాబ్‌లో తయారైన దాదాపు రూ. 30 లక్షల విలువైన అక్రమ మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం స్మగ్లర్లు తమ మద్యం తరలింపును గోప్యంగా చేయడానికి చాకచక్యంగా పద్ధతులు అనుసరించారు. మద్యం సీసాలను బంగాళదుంపల బోరాలలో దాచిపెట్టి ట్రక్ ద్వారా తరలించారు. అయితే, పట్నా మద్య నిషేధ విభాగానికి సమాచారం అందడంతో.. ముజఫర్‌పూర్‌లోని సదర్, మనియారి, తుర్కి పోలీస్ స్టేషన్ల బృందాలు సంయుక్తంగా ఈ దాడిని చేపట్టాయి. దీని ఫలితంగా, సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిఘ్రా NH-28 వద్ద ట్రక్‌ను ఆపి తనిఖీ చేసి అక్రమ మద్యం పట్టుకున్నారు.
పోలీసులు ట్రక్‌ను తనిఖీ చేసి దానిలో దాచిన మద్యం సీసాలను బయటకు తీశారు. ఈ ఘటనలో ట్రక్‌ను సీజ్ చేశారు. అయితే, మద్యం స్మగ్లర్లు ట్రక్ ను విడిచి పరారయ్యారు. పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, కొత్త సంవత్సరం వేడుకల సమయంలో మద్యం డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్న నేపథ్యంలో మద్యం మాఫియాలు భారీ స్థాయిలో సరఫరా చేయడానికి ప్రయత్నించాయి. ఈ దాడిలో మొత్తం మూడు పోలీస్ స్టేషన్ల బృందాలు కలిసికట్టుగా పనిచేశాయని అధికారులు తెలిపారు.
సీడీపీఓ (టౌన్ 1) సీమా దేవి మాట్లాడుతూ.., పట్నా మద్య నిషేధ విభాగం ద్వారా అందిన సమాచారం మేరకు ఈ దాడి జరిగింది. ట్రక్‌లో ఆలూ బోరాలలో దాచిన పంజాబ్‌లో తయారైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను గుర్తించి వారి అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.