BJP: పెద్దల సభలో 102కు పెరిగిన బీజేపీ బలం
ఉప రాష్ట్రపతి ఎన్నిక వేళ కీలక పరిణామం;
దేశ రాజకీయం మరో కీలక మలుపు తిరిగింది. ఆగస్టు 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల నెపథ్యంలో రాజ్యసభలో బీజేపీ బలం మరింత పెరిగింది. తాజాగా రాజ్యసభకు నామినేట్ అయిన ముగ్గురు ప్రముఖులు – ప్రముఖ క్రిమినల్ లాయర్ ఉజ్వల్ నికమ్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ సింగ్ శ్రింగ్లా, తమిళనాడుకు చెందిన విద్యావేత్త సీ. సదానందన్ – అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఈ ముగ్గురు సభ్యుల చేరికతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 102కి చేరింది. 2022 ఏప్రిల్ తర్వాత రెండోసారి బీజేపీ 100 మార్క్‌ను దాటడం గమనార్హం. పార్లమెంటులో ముఖ్య చర్చల సమయంలో, ముఖ్యంగా రాజ్యసభలో తేలికపాటి మెజారిటీ లేకపోవడంతో ఎప్పటికప్పుడు ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే తాజాగా నామినేటెడ్ సభ్యుల చేరిక పార్టీకి మరింత స్థిరత్వాన్ని కల్పించనుంది. రాజ్యసభలో మొత్తం 245 సీట్లుండగా, నామినేట్ సభ్యులు 12 మంది వరకు ఉండవచ్చు. వీరిలో అధిక భాగం ప్రభుత్వ అనుకూలంగానే ఉంటారు. తాజా చేరికలతో బీజేపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మెజారిటీ సులభంగా సాధించగలదన్న విశ్లేషణ రాజకీయం వర్గాల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ముప్పై ఎనిమిది పార్టీలకు చెందిన సభ్యులు రాజ్యసభలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ వంటి ప్రధాన విపక్షాల బలం తగ్గిపోతుండడం బీజేపీకి అనుకూలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ చేపడుతున్న వ్యూహాత్మక రాజకీయాలు, తద్వారా పార్లమెంటులో కీలక చట్టాల ఆమోదానికి మార్గం సుగమం కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పహల్గాం దాడి – పాక్ హస్తం మరోసారి బహిర్గతం
పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నవారు పాక్‌కు చెందినవారేనని మరో తిరుగులేని ఆధారం బయటపడింది. ‘ఆపరేషన్ మహాదేవ్’లో హతమైన తాహీర్ హబీబ్‌కు పీఓకేలో జనాజా-ఎ-గైబ్ విధానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఖైగాలాలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు టెలిగ్రామ్‌లో లభ్యమయ్యాయి. తాహీర్ లష్కరే తోయిబాతో అనుబంధం కలిగి ఉండటంతో పాటు, పాక్ సైన్యంతో గాఢమైన సంబంధాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. శ్రీనగర్ సమీపంలోని మహాదేవ్ పర్వత శ్రేణుల్లో ఈ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు గుర్తించారు. చైనా తయారీ టీ82 కమ్యూనికేషన్ సెట్‌ను ఉపయోగించడంతో ఉగ్రుల స్థానం గుర్తించి, సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ముగ్గురిని మట్టుబెట్టారు. ఈ దాడి వెనుక పాక్ మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది.