Himachal Pradesh: రాజ్యసభ ఎన్నికల్లో చక్రం తిప్పిన బీజేపీ
హిమాచల్ కాంగ్రెస్ సర్కార్ కూలిపోనుందా..;
హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్యంగా భాజపా అభ్యర్థి హర్ష్ మహాజన్ విజయం సాధించారు. ఒకే స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష భాజపా గెలుపొందింది. హిమాచల్‌ప్రదేశ్‌లో అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ భాజపా తన అభ్యర్థిని నిలబెట్టడం వల్ల అక్కడ ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 68మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్‌కు 40 మంది, భాజపాకు 25 మంది సభ్యులు ఉన్నారు. స్వతంత్రులు మూడుచోట్ల గెలిచారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు MLAలు , ముగ్గురు స్వతంత్రులు భాజపా అభ్యర్థికి ఓటు వేశారు. ఫలితంగా ఇద్దరు అభ్యర్థులకు చెరో 34 ఓట్లు వచ్చాయి. అయితే.కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ బబ్లూ ఓటు చెల్లదని ప్రకటించాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ క్రమంలో లెక్కింపు కేంద్రం వద్ద..కాంగ్రెస్, భాజపా నేతలు గొడవకు దిగారు. చివరకు టాస్ ద్వారా భాజపా అభ్యర్థి గెలిచినట్లు EC ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు భాజపా సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మరోవైపు రాజ్యసభ ఎన్నికల కోసం విప్ జారీచేశామన్న ముఖ్యమంత్రి సుక్విందర్‌సింగ్ సుక్కు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై అనర్హత వేటు పడేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మరికొంత మంది ఎమ్మెల్యేలను కమలం పార్టీ తమవైపునకు తిప్పుకొంటే.. కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతకుముందు అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత, మాజీ సీఎం జైరాం ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని, సీఎం సుఖ్విందర్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇక 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకీ కేవలం 25 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అయితే ఈ 25 మందితోపాటు ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్‌కు ఓటు వేయడంతో 34 ఓట్లు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్‌లో చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సర్కార్ పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికి బీజేపీ వల వేసి తమవైపు తిప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా పోలింగ్‌కు ముందే తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని బీజేపీ నేతలు చెప్పడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది.