BJP: రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ..
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక!;
బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆదివారం అభ్యర్థిని ఖరారు చేయాలని అధిష్టానం భావిస్తోంది.
ఉపరాష్ట్రపతి పదవిని గెలుచుకోవడానికి బీజేపీ దగ్గర బలం ఉంది. మిత్రపక్షాలను కలుపుకుని విజయం సాధించనుంది. అలాగే తటస్థంగా ఉండే బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ వంటి పార్టీల మద్దతును కూడా బీజేపీ కోరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే ఈ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆ పార్టీల మద్దతు కోరే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
సీనియర్ కేంద్ర మంత్రులు, అనుభవజ్ఞులైన పార్లమెంటేరియన్లు నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లోనే ఎంపీల విధులు, బాధ్యతలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎంపీలంతా సెప్టెంబర్ 6 సాయంత్రం నాటికి ఢిల్లీకి చేరుకోవాలని ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇక సెప్టెంబర్ 8న ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఉన్న కారణాన ఈ మాక్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
ఇక ఆదివారం ఎన్డీఏ పక్షం ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత ఇండియా కూటమి కూడా అభ్యర్థిని నిలబెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మల్లిఖార్జున ఖర్గే ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రతిపక్షాల ఐక్యతను చాటిచెప్పాలని కూటమి భావిస్తోంది. ఇప్పటికే రాహుల్‌గాంధీ ప్రత్యేక విందు ఏర్పాటు చేసి ఐక్యంగా ఉన్నట్లు నిరూపించారు. మరొకసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక ద్వారా నిరూపించాలని భావిస్తోంది.
రాజ్యసభలో బీజేపీకి 102 సీట్లు ఉన్నాయి. మిత్రపక్షాల సాయంతో ఆ సంఖ్య 132కు చేరింది. ఇక ఏడుగురు నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. వీరు కూడా ఎన్డీఏకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఆ సంఖ్యా బలం 139కి చేరుతుంది. ఇక లోక్‌సభలో బీజేపీకి 240 మంది సభ్యులు ఉన్నారు. మిత్రపక్షాలతో కలిపి 293 మంది ఉన్నారు. దీంతో సులభంగా ఉపరాష్ట్రపతి పదవిని గెలుచుకోనుంది. ఇక ఇండియా కూటమిలో కాంగ్రెస్ నుంచి 99 లోక్‌సభ ఎంపీలు, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కలిపినా ఎన్డీఏ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం కష్టం. అయినా కూడా తమ ఐక్యతను చాటి చెప్పాలని యోచిస్తోంది.