Mark Margolis(83): అనారోగ్యంతో 'బ్రేకింగ్ బాడ్' హీరో కన్నుమూత
టెలివిజన్ చరిత్రలో అత్యంత మరపురాని పాత్రలు చేసిన మార్క్ మార్గోలిస్;
"బ్రేకింగ్ బాడ్", "బెటర్ కాల్ సాల్"లతో ప్రశంసలు పొంది, టీవీ షోలలో కనిపించి, వీల్ చైర్-బౌండ్ కార్టెల్ సభ్యుడిగా హెక్టర్ సలామాంకా పాత్ర పోషించిన నటుడు మార్క్ మార్గోలిస్ 83 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆగస్టు 4న అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ప్రకటించారు. మార్గోలిస్ కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆగస్టు 3న న్యూయార్క్ ఆసుపత్రిలో మరణించారు.
మార్గోలిస్‌కు భార్య జాక్వెలిన్ ఉండగా.. ఆయన 61 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నాడు. వారి ఏకైక సంతానం మోర్గాన్ కాగా.. ప్రస్తుతం ఆయనకు వారి ముగ్గురు మనవళ్లు ఉన్నారు. ఈ సందర్భంగా మార్గోలిస్ అధికారిక ట్విట్టర్ ఖాతా ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించింది. టెలివిజన్ చరిత్రలో అత్యంత మరపురాని పాత్రలలో ఒకటైన హెక్టర్ సలామాంకా పాత్రను పోషించిన ఆయన్ను ప్రశంసిస్తూ ఈ పోస్ట్ ను చేశారు.
"బ్రేకింగ్ బాడ్"లో నటించిన బ్రయాన్ క్రాన్‌స్టన్ కూడా మార్గోలిస్‌కు నివాళులర్పించారు. ఆయన గొప్ప నటుడు, మానవత్వం గలిగిన వాడు అని ప్రశంసించారు. "మార్క్ మార్గోలిస్ నిజంగా మంచి నటుడు, మనోహరమైన మానవుడు. సెట్ లో చాలా సరదాగా, ఆకర్షణీయంగా ఉండేవాడు అంటూ ఆయనకు సంబంధించిన రెండు ఫొటోలను బ్రయాన్ క్రాన్‌స్టన్ ఈ సందర్భంగా పంచుకున్నారు.
1939లో ఫిలడెల్ఫియాలో జన్మించిన మార్గోలిస్.. నటనపై ఆసక్తితో అదే తన కెరీర్ గా మలచుకున్నాడు. అలా పలు పాత్రలతో మెప్పించి మంచి యాక్టర్‌గా విజయం సాధించాడు. "స్కార్‌ఫేస్," "ఏస్ వెంచురా: పెట్ డిటెక్టివ్," "బ్లాక్ స్వాన్," "ఓజ్"తో సహా పలు సినిమాలు, టీవీ సిరీస్‌లలోనూ ఆయన కనిపించాడు. అంతే కాకుండా మార్గోలిస్ 2012లో "బ్రేకింగ్ బాడ్"లో తన పాత్రకు ఎమ్మీ నామినేషన్ అందుకున్నాడు.