BUDGET2025: నేడే పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్
వరుసగా ఎనిమిదోసారి ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ... బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాల భారీ ఆశలు;
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నిర్మలమ్మ రికార్డు స్థాయిలో వరుసగా 8వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కసిత భారత్ లక్ష్యంగా సాగుతున్న మోదీ సర్కార్ పేదరిక నిర్మూలన, ఆహారభద్రత, ఆరోగ్యం, సామాజిక సంక్షేమానికి అనేక పథకాలు అమలుచేస్తోంది. ఈ బడ్జెట్‌లో కొత్తవి జోడిస్తారా లేక ఉన్న వాటికే కేటాయింపులు పెంచుతారా అనే విషయమై ఆసక్తి నెలకొంది. పేద, మధ్యతరగతిసహా కొన్నివర్గాల్లో ఆశలు రేపాయి. వృద్ధిరేటు తగ్గినందున ఆదాయపు పన్నులో మార్పులు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఈ సారి కేంద్ర బడ్జెట్ రూ.50 లక్షల కోట్లకుపైనే
వచ్చే నెల 1న నిర్మలమ్మ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి రూ.50 లక్షల కోట్లపై చిలుకు విలువ గల బడ్జెట్‌ను ఆర్థిక శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఆర్థికశాఖ కార్యదర్శి తుహిన్ కాంతా పాండేతోపాటు కీలక అధికారులు బడ్జెట్ రూపకల్పనలో అవిశ్రాంతంగా పని చేశారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ తయారైంది. అధికారులు తుది రూపును ఇస్తున్నారు. ఈ ఏడాది వృద్ధిరేటు 6.4శాతానికి పడిపోతుందన్న అంచనాలున్నాయి.
నిర్మలమ్మ ముందున్న సవాళ్లు ఇవే
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్న ఎనిమిదో బడ్జెట్ ఇది. వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్‌లో.. పతనమవుతున్న ఆర్థిక వృద్ధిరేటు, అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం, వినియోగ డిమాండ్‌లో పెరుగుదల వంటి పలు సవాళ్లను నిర్మలమ్మ పరిష్కరించాల్సి ఉంది. వీటిపై ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది.
కేంద్ర బడ్జెట్.. నిర్మలమ్మ జట్టు ఇదే
కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో నిర్మలా సీతారామన్‌కు రెవెన్యూ విభాగం కార్యదర్శి పాండే, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్, వ్యయాల కార్యదర్శి మనోజ్ గోవిల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్‌వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి అరుణిష్ చావ్లా, ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు, ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ చేయూతనిచ్చారు.
'బ్లాక్ బడ్జెట్' గురించి మీకు తెలుసా?
పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం కారణం 1971 తరువాత భారత ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున ఒత్తిడిని ఎదుర్కొంది. ఆ టైమ్ లో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంతరావు చవాన్ 1973 - 74 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రూ.550 కోట్ల ఆర్థిక లోటు గురించి ప్రకటించడంతో ఆర్థిక పరిస్థితి మరింత అనిశ్చితిగా మారింది. అప్పట్లో ఈ మొత్తం చాలా పెద్దదని చెప్పవచ్చు. ఆ ఏడాది బడ్జెట్ ను బ్లాక్ బడ్జెట్ గా ఆర్థిక నిపుణులు వర్ణించారు.