Calcutta High Court: పరిచయం లేని మహిళను అలా పిలిచినా కలకత్తా హైకోర్టు
'డార్లింగ్' అని పిలిస్తే జైలుకే..;
మహిళలను నోటికొచ్చినట్టు పిలిస్తే జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని కలకత్తా హైకోర్టు హెచ్చరించింది. మహిళలతో మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉందని గుర్తుచేసింది. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడమే గాక.. ఆమెను ‘డార్లింగ్’ అంటూ పిలిచాడు. దీంతో ఆమె ఫిర్యాదు చేయగా.. న్యాయస్థానం ఈ కేసులో అతన్ని దోషిగా తేల్చింది. పరిచయం లేని మహిళలను ‘డార్లింగ్’ అని పిలువడం లైంగికంగా వేధించడమే అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. అలా పిలిస్తే ఐపీసీ 354 ఎ, 509 సెక్షన్ల కింద నేరస్థులుగా పరిగణించవచ్చని పేర్కొంది.
ఈ మేరకు పోర్టు బ్లెయిర్‌లోని హైకోర్టు బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ జై సేన్‌గుప్తా తీర్పు వెలువరించారు. గతేడాది అండమాన్ నికోబార్‌లోని మాయాబందర్ ప్రాంతంలో దుర్గా పూజ సందర్భంగా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. విధుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్‌తో జనక్ రామ్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న అతను ఆమెను డార్లింగ్ అని సంబోధించాడు. అంతేగాక ‘చలాన్ ఇవ్వడానికి వచ్చావా..?’ అంటూ దురుసుగా మాట్లాడాడు.
అతడిపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన నార్త్-మిడిల్ అండమాన్ ఫస్ట్ క్లాస్ కోర్టు జనక్ రామ్‌ను దోషిగా తేల్చింది. మూడు నెలల జైలు శిక్షతోపాటు రూ.500 జరిమానా విధించింది. ఈ తీర్పును అడిషనల్ సెషన్స్ కోర్టులో అతడు సవాల్ చేయగా ఆ కోర్టు కూడా తీర్పును సమర్థించింది. దాంతో కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు సైతం ఫస్ట్‌క్లాస్ కోర్టు తీర్పును సమర్థించింది. డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపేనని తేల్చి చెప్పింది.