CBSE Exams Cancelled : పశ్చిమాసియా దేశాల్లో సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు

బహ్రెయిన్‌, ఇరాన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాల్లో

Update: 2026-03-06 04:00 GMT

 పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఆ దేశాల్లో జరగాల్సిన 10వ తరగతి బోర్డు పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్టు, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది.

పశ్చిమాసియాలో ఉన్న బహ్రెయిన్‌, ఇరాన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాల్లో మార్చి 7 నుంచి 11 వరకు జరగాల్సిన పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే అంతకుముందు మార్చి 2, మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సి ఉండి, వాయిదా పడిన పరీక్షలను కూడా రద్దు చేసినట్టు బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. మార్చి 7వ తేదీన జరగాల్సిన 12వ తరగతి పరీక్ష వాయిదా పడిందని తెలిపింది. అంతకుముందే మార్చి 2, 5, తేదీల్లో జరగాల్సిన పరీక్షలను బోర్డు ఇప్పటికే వాయిదా వేసింది.

మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ప్రారంభమైన దాడులు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ సైతం ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సైప్రస్, ఇరాక్‌, జోర్డాన్‌ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అయితే ఈ దాడుల్లో ఇప్పటివరకూ దాదాపు 1200 మంది కంటే ఎక్కువే మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది.

Tags:    

Similar News