జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020కి అనుగుణంగా పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించడానికి సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సమాయత్తమైంది. అన్నీ కుదిరితే, వచ్చే ఏడాది అంటే 2026 నుంచే ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చనున్నది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి, సీబీఎస్‌ఈ, ఎన్సీఈఆర్టీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్), నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ముసాయిదాపై వచ్చే సోమవారం నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తాజా విధానంతో పరీక్షల్లో ఉత్తమ స్కోరును సాధించేందుకు విద్యార్థులకు అవకాశం లభిస్తుందని విద్యాశాఖకు చెందిన అధికారులు పేర్కొన్నారు. అయితే, సెమిస్టర్ విధానాన్ని తాము పాటించట్లేదని గుర్తుచేశారు.
సీబీఎస్‌ఈ పది, పన్నెండో తరగతి పరీక్షలను ప్రస్తుతం ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించి మేలో ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఫెయిలైన విద్యార్థులకు జూలైలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లోనే ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో తమ మార్కులను మెరుగుపర్చుకోవడానికి పాసైన విద్యార్థులకూ అవకాశం కల్పిస్తున్నారు. అయితే, తాజా విధానం అమల్లోకి వస్తే, అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) ప్రవేశాలపై ప్రభావం పడకుండా నూతన విద్యా క్యాలెండర్‌ను రూపొందించే అవకాశం ఉన్నదని అధికారి ఒకరు తెలిపారు. రెండు బోర్డు పరీక్షల మధ్య నిర్ణీత కాల వ్యవధి ఉంటుందని, దీంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవడానికి తగిన సమయం లభిస్తుందని పేర్కొన్నారు. అయితే, ఏడాదికి రెండుసార్లు నిర్వహించే ఈ బోర్డు పరీక్షలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారన్నది త్వరలో వెల్లడిస్తామన్నారు.