Red Fort Blast: ఢిల్లీ ఎర్రకోట వ‌ద్ద‌ పేలుడు.. బయటకు వచ్చిన సీసీటీవీ దృశ్యాల విడుదల

దాడి వెనుక 'వైట్ కాలర్' ఉగ్రముఠా హస్తం ఉన్నట్టు అనుమానం

Update: 2025-11-12 07:00 GMT

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది మృతిచెందగా, దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బుధవారం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ ప్రారంభించింది.

15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్‌లో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ప్రాంతం వాహనాలతో రద్దీగా ఉంది. నెమ్మదిగా కదులుతున్న వాహనాల మధ్య ఉన్న ఓ హ్యుందాయ్ ఐ20 కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి, పెద్ద అగ్నిగోళం ఎగిసిపడిన దృశ్యాలు నమోదయ్యాయి. సోమవారం సాయంత్రం 6:50 గంటలకు ఈ పేలుడు జరిగిందని, దీని ధాటికి పలు వాహనాలు దగ్ధమయ్యాయని సీసీటీవీ కంట్రోల్ రూమ్ అధికారులు తెలిపారు.

ఈ దాడి వెనుక జైష్-ఏ-మహ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న "వైట్ కాలర్" ముఠా హస్తం ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు కొన్ని గంటల ముందే ఈ ముఠాకు చెందిన ముగ్గురు డాక్టర్లు సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారిలో ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ముజమ్మిల్ గనై, డాక్టర్ షాహీన్ సయీద్ ఉన్నారు. ఈ యూనివర్సిటీ నుంచే 360 కిలోల అమోనియం నైట్రేట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకోట వద్ద పేలిపోయిన కారును నడుపుతున్న డాక్టర్ ఉమర్ నబీకి కూడా ఇదే యూనివర్సిటీతో సంబంధాలున్నాయి. ఈ పేలుడులో ఉమర్ నబీ మరణించి ఉంటాడని భావిస్తున్నారు. దాడికి ముందు గనై, ఉమర్ కలిసి ఎర్రకోట ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్టు సమాచారం. వీరు దీపావళి నాడు దాడులకు ప్లాన్ చేసి విఫలమైనట్టు తెలుస్తోంది.

ఐ20 కారులో అమోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ మిశ్రమంతో కూడిన శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని (ANFO) నింపినట్టు అధికారులు భావిస్తున్నారు. డిటోనేటర్‌ను మాన్యువల్‌గా యాక్టివేట్ చేసినట్టు ఆధారాలు లభించడంతో ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో అమోనియం నైట్రేట్ కంటే శక్తివంతమైన హై-గ్రేడ్ పేలుడు పదార్థాల నమూనాలను కూడా సేకరించారు.

ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. పారామిలటరీ బలగాలతో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరం అన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Tags:    

Similar News