PADMA AWARDS: 132 మందికి పద్మ పురస్కారాలు
చిరంజీవి సహా అయిదుగురికి పద్మ విభూషణ్.... 17మందికి పద్మభూషణ్...110 మందికి పద్మశ్రీ..;
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం...వివిధ రంగాలకు చెందిన 132మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. అందులో ఐదు పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి. ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో 30మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. 9 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవికి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. వారితోపాటు కళారంగం నుంచి నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతిమాల , ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యంలనూ...ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. బిహార్‌కు చెందిన సులభ్ శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ పాఠక్‌కు సామాజిక సేవా విభాగంలో మరణానంతరం పద్మవిభూషణ్‌ను ప్రకటించింది.
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కిన కేరళకు చెందిన దివంగత జస్టిస్ ఫాతిమా బీవీకి మరణానంతరం పద్మభూషణ్ లభించింది. మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీమంత్రి రామ్‌నాయక్, కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఒ.రాజగోపాల్, ప్రముఖ గాయనీ ఉషా ఉతుప్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్ శర్మలకు పద్మభూషణ్ ప్రకటించారు. పశ్చిమబెంగాల్ నుంచి ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి, తమిళనాడు నుంచి దివంగత నటుడు విజయ్‌కాంత్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. సాహిత్యం, విద్య, జర్నలిజం రంగాల నుంచి మహారాష్ట్రకు చెందిన హర్మస్‌జీ ఎన్ కామా, కుందన్ వ్యాస్, అదే రాష్ట్రం నుంచి వైద్య రంగంలో సేవలకు గాను అశ్విన్ బాలచంద్ మెహతా, కళా రంగం నుంచి దత్తాత్తేయ అంబదాస్ మయాలు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
వైద్య రంగంలో సేవలకు గాను గుజరాత్‌కు చెందిన తేజస్ మధుసూదన్ పటేల్, బిహార్‌కు చెందిన చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్‌లను పద్మ భూషణ్ అవార్డ్ దక్కింది. వాణిజ్యం, పరిశ్రమ రంగానికి సంబంధించి కర్ణాటకకు చెందిన సీతారామ్ జిందాల్, తైవాన్‌కు చెందిన యువాంగ్ లీయూ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రజా సేవా విభాగంలో పశ్చిమ బంగాల్‌కు చెందిన సత్యబ్రత ముఖర్జీ, ఆధ్యాత్మికంలో లద్దాఖ్‌కు చెందిన తోగ్దాన్ రిన్‌పోచేకు మరణానంతరం పద్మభూషణ్ అవార్డ్‌కు ఎంపికయ్యారు.
` ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది రెండు పద్మవిభూషణ్‌లతోపాటు డి.ఉమామహేశ్వరికి పద్మశ్రీ లభించింది. తెలంగాణకు 5 పద్మశ్రీ అవార్డ్‌లు దక్కాయి. అందులో కళారంగం నుంచి ఎ.వేలు ఆనందాచారి, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య; సాహిత్యం, విద్యారంగం నుంచి కేతావత్ సోమ్‌లాల్, కూరెల్ల విఠాలాచార్య ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు 103 మందికి, తెలంగాణ నుంచి 168మందికి పద్మపురస్కారాలు లభించినట్లయింది. తాజా అవార్డులతో కలిపి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 8మందికి పద్మవిభూషణ్, 25మందికి పద్మభూషణ్, 70 మందికి పద్మశ్రీలు దక్కాయి. తెలంగాణ నుంచి ఇప్పటివరకు 14 మందికి పద్మవిభూషణ్, 34 మందికి పద్మభూషణ్, 120 మందికి పద్మశ్రీలు లభించాయి.