Ladakh Violence: లడఖ్ హింసపై కేంద్రం ప్రత్యేక దృష్టి..
హింస వెనుక సోనమ్ వాంగ్‌చుక్ ఉన్నట్లు గుర్తింపు
భారత్‌లో ఇప్పటిదాకా ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ బుధవారం హఠాత్తుగా లడఖ్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రాష్ట్ర హోదా పేరుతో నిరసనకారులు రోడ్లపైకి నానా బీభత్సం సృష్టించారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వి.. వాహనాలు తగలబెట్టారు. అంతటితో ఆగకుండా బీజేపీ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలపై దాడి చేసి తగలబెట్టారు. దీంతో నేపాల్‌లో మాదిరిగా జెన్-జెడ్ తరహాలో హింస చెలరేగింది. దీంతో ఒక్కసారిగా కేంద్రం అప్రమత్తం అయింది. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా బుధవారం కేంద్ర భూభాగంలోని లేహ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధించారు. దీంతో భారీగా భద్రతా దళాలు మోహరింపు హింస చెలరేగకుండా ఆపగలిగారు.
ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరసన దీక్ష చేస్తున్నాడు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సోనమ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లుగా కేంద్రం గుర్తించింది. కొన్ని గుంపులను హింసకు ప్రేరేపించినట్లుగా అనుమానిస్తోంది. లడఖ్‌కు రాష్ట్ర హోదా కోసం అరబ్ స్ప్రింగ్ తరహా ఉద్యమాన్ని కోరుకుంటున్నట్లు సోనమ్ ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా నేపాల్‌లో జరిగిన జెన్-జెడ్ ఉద్యమాన్ని కూడా పదే పదే ప్రస్తావించడంతో బుధవారం హఠాత్తుగా హింస చెలరేగినట్లుగా కేంద్రం భావిస్తోంది. సోనమ్.. అరబ్ స్ప్రింగ్ తరహా నిరసన, నేపాల్‌లో జనరల్ జెడ్ నిరసనల తరహా రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించాడని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక బుధవారం జరిగిన హింసలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 70 మంది గాయపడ్డారు. లడఖ్‌లో పరిస్థితి దానంతట అదే అదుపు తప్పలేదని.. ఉద్దేశపూర్వకంగా దీనిని సృష్టించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టడం వల్లే ఇదంతా జరిగిందని పేర్కొంది. సోనమ్ వాంగ్‌చుక్ వ్యక్తిగత ఆశయాలకు లడఖ్, యువ జనాభా భారీ మూల్యం చెల్లిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కుట్రలో చిక్కుకున్నందుకు వారిని నిందించలేమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లడఖ్ ప్రజల సంక్షేమం, సాధికారతకు కేంద్రం కట్టుబడి ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.