ISRO: చంద్రయాన్‌-3లో అంతా బాగుంది

లక్ష్యం దిశగా పయనిస్తున్నామన్న ఇస్రో ఛైర్మన్‌... అతిపెద్ద సవాళ్లు ముందు ఉన్నాయని వ్యాఖ్య

Update: 2023-08-08 03:00 GMT

జాబిల్లిలోని రహస్యాలను ఛేదించేందుకు నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3లో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( Indian Space Research Organisation) ఛైర్మన్‌ (ISRO Chairman) ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. త్వరలో చంద్రయాన్‌ -3 వ్యోమనౌక జాబిల్లి చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశిస్తుందని, అక్కడి నుంచి జాబిల్లికి మరింత చేరువయ్యే క్రమంలో కక్ష్య నిర్ధారణ ప్రక్రియ చాలా కీలకం కానుందని ఆయన తెలిపారు.


వంద కిలోమీటర్ల వరకూ చంద్రయాన్‌-3కు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇస్రో ఛైర్మన్‌ తెలిపారు. ఆ తర్వాతే క్లిష్టమైన దశ ప్రారంభమవుతుందని వెల్లడించారు. భూమి నుంచి ల్యాండర్‌ స్థితిని నిర్దిష్టంగా అంచనావేయడమే చాలా సవాల్‌తో కూడుకున్న పని సోమనాథ్‌ తెలిపారు. ఇది చాలా కీలకమైన కొలతని... దీన్ని ‘కక్ష్య నిర్ధారణ ప్రక్రియ’గా పేర్కొంటామని వివరించారు. ఇవన్నీ సక్రమంగా ఉంటే మిగతా ప్రక్రియ మొత్తం సాఫీగా సాగిపోతుందని వెల్లడించారు.

ఈసారి చంద్రయాన్‌-3 వ్యోమనౌక కక్ష్యను అత్యంత కచ్చితత్వంతో కిందకి దించామని, ప్రణాళిక ప్రకారమే ఇది సాగుతోందని ఇస్రో ఛైర్మన్‌ తెలిపారు. ఎలాంటి అవరోధాలు కూడా లేవన్నారు. రానున్న రోజుల్లోనూ అంతా సవ్యంగానే సాగుతుందని భావిస్తున్నామని సోమనాథ్‌ తెలిపారు. చంద్రయాన్‌-2 అనుభవాలు ఇప్పుడు తమకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఆ ల్యాండర్‌ వైఫల్యానికి కారణాలను గుర్తించి, ఆ మేరకు తాము చంద్రయాన్‌-3లో మార్పులు చేపట్టినట్లు వివరించారు.


చంద్రయాన్‌ 3( CHANDRAYAAN 3) వ్యోమనౌకను జాబిలి కక్ష్యలో ప్రవేశించిన మరుసటి రోజే దాన్ని కక్ష్య తగ్గింపు ప్రక్రియ(orbit reduction)ను ఇస్రో ఇటీవలే విజయవంతంగా(successfully) పూర్తి చేసింది. చంద్రయాన్-3 ఇప్పుడు 170 ఇన్‌టు 4వేల 313 కిలోమీటర్ల కక్ష్యను చేరుకుంది. కక్ష్య తగ్గింపును ప్రణాళికబద్దంగా పూర్తి చేసి చంద్రుడి ఉపరితలానికి మరింత దగ్గరకు తీసుకెళ్లామని( closer to the moon's surface) ఇస్రో( ISRO) ప్రకటించింది. తదుపరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 9న మధ్యాహ్నం ఒకటి- రెండు గంటల మధ్య నిర్వహిస్తామని ఇస్రో ప్రకటించింది. ఆ తర్వాత మరో రెండుసార్లు కూడా కక్ష్య తగ్గింపును చేపడతారు.


చంద్రయాన్‌ ప్రాజెక్ట్స్‌లో భాగంగా ఇస్రో ఇప్పటివరకు మూడు ప్రయోగాలు చేపట్టింది . మొదటి ప్రయోగమైన చంద్రయాన్ 1 విజయవంతమైంది. 2019లో చేపట్టిన రెండో ప్రయోగం.. చంద్రయాన్ 2 విఫలమైంది. జాబిల్లిపై ల్యాండర్‌ను మృదువుగా దించడంతో ఇస్రో వైఫల్యం చవిచూసింది. దీనితో పూర్తి జాగ్రత్తలు తీసుకుని, సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్‌ చేసి , చంద్రయాన్ 3ని సిద్ధం చేసింది ఇస్రో. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన దేశంగా అమెరికా, రష్యా, చైనా సరసన భారత్‌ నిలవనుంది. 

Tags:    

Similar News