Chandrayaan 3: చందమామకు మరింత సమీపంగా...
చంద్రయాన్-3 జాబిల్లికి మరింత దగ్గరికి వెళ్లినట్లు ఇస్రో ప్రకటన... మరో ప్రదక్షిణ పూర్తి చేసినట్లు వెల్లడి...;
చంద్రయాన్-3 (Chandrayaan 3)జాబిల్లికి మరింత దగ్గరగా వెళ్లినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో(ISRO) వెల్లడించింది. చంద్రయాన్-3 మరో ప్రదక్షిణను పూర్తి చేసిందని వెల్లడించింది. చంద్రుడి ఉపరితలానికి మరింత దగ్గరగా చేరుకొన్నామని ప్రకటించిన ఇస్రో... చంద్రయాన్-3 ఆర్బిటర్‌ను 174 km x 1437 km( 174km x 1,437km) తగ్గించామని వెల్లడించింది. ఆగస్టు 14న మరో దశలో కక్ష్య తగ్గింపు ప్రక్రియ చేపడతామని ఇస్రో ప్రకటించింది. ఆగస్టు 16న చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి ఈ అంతరిక్ష నౌక చేరనుంది. ఆ మర్నాడే ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోతుంది. దీనిలో విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ ఉంటాయి. అంతా సజావుగా సాగితే ఈ నెల 23 సాయంత్రం 5.47గంటలకు ల్యాండర్-రోవర్ చంద్రుడిపై ల్యాండింగ్‌కు ఉపక్రమిస్తుంది.
జాబిల్లిలోని రహస్యాలను ఛేదించేందుకు నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3(Chandrayaan-3 )లో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని ఇస్రో ( Indian Space Research Organisation) ఛైర్మన్ (ISRO Chairman) ఎస్.సోమనాథ్ ఇప్పటికే ప్రకటించారు. వంద కిలోమీటర్ల వరకూ చంద్రయాన్-3కు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. ఆ తర్వాతే క్లిష్టమైన దశ ప్రారంభమవుతుందని వెల్లడించారు. భూమి నుంచి ల్యాండర్ స్థితిని నిర్దిష్టంగా అంచనావేయడమే చాలా సవాల్‌తో కూడుకున్న పని సోమనాథ్ తెలిపారు. ఈసారి చంద్రయాన్-3 వ్యోమనౌక ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతోందని ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-2 అనుభవాలు ఇప్పుడు తమకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఆ ల్యాండర్ వైఫల్యానికి కారణాలను గుర్తించి, ఆ మేరకు తాము చంద్రయాన్-3లో మార్పులు చేపట్టినట్లు వివరించారు.
చంద్రయాన్ ప్రాజెక్ట్స్‌లో భాగంగా ఇస్రో ఇప్పటివరకు మూడు ప్రయోగాలు చేపట్టింది . మొదటి ప్రయోగమైన చంద్రయాన్ 1 విజయవంతమైంది. 2019లో చేపట్టిన రెండో ప్రయోగం.. చంద్రయాన్ 2 విఫలమైంది. జాబిల్లిపై ల్యాండర్‌ను మృదువుగా దించడంతో ఇస్రో వైఫల్యం చవిచూసింది. దీనితో పూర్తి జాగ్రత్తలు తీసుకుని, సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసి , చంద్రయాన్ 3ని సిద్ధం చేసింది ఇస్రో. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలవనుంది.