Chandrayaan-3 : సజావుగా సాగుతోంది
మిషన్ పురోగతిని పర్యవేక్షిస్తున్న ఇస్రో బృందం;
చంద్రయాన్ మిషన్ సజావుగా సాగుతోందని ఇస్రో తన అప్డేట్ లో ప్రకటించింది. ప్రస్తుతం ఈ మిషన్ సజావుగా తనకు నిర్దేశించిన మార్గంలో పయనిస్తోందని వెల్లడించింది. చంద్రయాన్ క్రమక్రమంగా కక్ష్యను పెంచి అంతిమంగా చంద్రుడివైపునకు దీన్ని మళ్లించాలనేది ఇస్రో ప్లాన్. ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ కాలుమోపుతుంది. 40 రోజుల తర్వాతే శాస్త్రవేత్తలకు అసలైన సవాలు ఎదురవుతుంది. చంద్రయాన్ 3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటాయి. వీటిని దేశీయంగా అభివృద్ధి చేశారు. ప్రొపల్షన్ మాడ్యూల్ బరువు 2,148 కేజీలు కాగా, ల్యాండర్ విక్రమ్ బరువు 1,723.89, రోవర్ ప్రజ్ఞాన్ బరువు 26 కేజీలు.
మొత్తం బరువు 3,900 కిలోలు. చంద్రయాన్ 3లో ప్రయోగించిన రోవర్ చంద్రుడిపై విజయవంతంగా దిగితే, ఇప్పటి వరకూ ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలుస్తుంది.
ప్రత్యక్షంగా, టీవీలలో లక్షలాది మంది చూస్తుండగా చంద్రయాన్ 3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రయాన్ ప్రయోగాన్ని వీక్షించేందుకు వివిధ పాఠశాలల నుంచి 200 మంది విద్యార్థులను స్పేస్ సెంటర్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధన చేపట్టడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ల్యాండర్ సాయంతో చంద్రుడి దక్షిణ ధ్రువపు రహస్యాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆగస్టు 23 - 24 తేదీల మధ్య ల్యాండర్ చంద్రుడిని చేరుకోనుంది. ఆ తర్వాత ల్యాండర్-రోవర్.. పేలోడ్ ప్రొపల్షన్ నుంచి విడిపోయి ల్యాండ్ అవుతుంది. ఆపై రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై కలియదిరుగుతూ పరిశోధనలు ప్రారంభిస్తుంది. ప్రజ్ఞాన్ వెనుక చక్రాలు ISRO, జాతీయ చిహ్నం గుర్తులను చంద్రుడి ఉపరితలంపై ముద్రిస్తాయి. అయితే రోవర్ ను సూర్య రశ్మి ఉన్న చోటే ల్యాండ్ చేయనున్నారు. ఎందుకంటే రోవర్ కు సోలార్ ప్యానల్ అమార్చరు. సూర్య రశ్మి ఉన్న చోట రోవర్ ల్యాండ్ చేయడం వల్ల అది సోలార్ ప్యానల్ ద్వారా రీఛార్జ్ అయి పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2019లో చంద్రయాన్ 2లో రోవర్ ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఈ మిషన్ ఫేలయింది. దీని పాఠాల నేర్చుకున్న ఇస్రో నాలుగు సంవత్సరాల్లోనే చంద్రయాన్ 3 ప్రయోగం ప్రారంభించింది.