Uttar Pradesh: ప్రాజెక్ట్ అంటే హిందూ మహిళ, కోడ్ భాషలో మతమార్పిడీలు…తవ్వేకొద్దీ సంచలన విషయాలు
ఇస్లాం దేశాల నుంచి కోట్ల నిధులు.. ఈడీ విచారణ..;
మతమార్పిడి కేసులో అరెస్టయిన చెంగూర్ బాబా కేసులో తవ్వేకొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విదేశాల నుంచి సొమ్ములు పోగేసి.. అక్రమంగా మతమార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్ అలియస్ చంగూర్‌బాబా ఆర్థిక నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిమగ్నమైంది. అతడికి సంబంధించిన 30 బ్యాంక్ ఖాతాలపై దర్యాప్తు కొనసాగుతుండగా.. మరో 18 అకౌంట్ల సమాచారం వెలుగులోకి వచ్చింది. వీటిల్లో దాదాపు రూ.68 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వీటికి గత మూడు నెలల్లోనే విదేశాల నుంచి రూ.7 కోట్లు బదిలీ అయినట్లు తేలింది. అతడి చీకటి ఆర్థిక కార్యకలాపాల నెట్‌వర్క్‌లో ఈ ఖాతాలు కూడా భాగమని అధికారులు చెబుతున్నారు.
జలాలుద్దీన్ మతమార్పిడుల రాకెట్‌ను నిర్వహించే క్రమంలో కోడ్ భాషను ఉపయోగించేవాడు. యూపీ ఏటీఎస్ దీనిని ఛేదించింది. చంగూర్ బృందం టార్గెట్ చేసిన మహిళలను ‘ప్రాజెక్ట్’ అని.. మతమార్పిడిని ‘మిట్టీ పలట్నా’ అని.. మహిళలను మభ్యపెట్టడాన్ని ‘కాజల్ కర్నా’ అని, జలాలుద్దీన్‌తో భేటీ ఏర్పాటు చేయడాన్ని ‘దీదార్’ అని వ్యవహరించేవాడు. చంగూర్‌బాబా ఆర్థిక నెట్‌వర్క్ భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అతడికి భారత్, నేపాల్‌లో 100 వరకు ఖాతాలున్నట్లు తెలుస్తోంది.
మూడేళ్లలో చెంగూర్ బాబాకి రూ.500 కోట్ల విదేశీ నిధులు అందగా…దానిలో రూ.300 కోట్లు అక్రమ మార్గాల్లోనే వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం నేపాల్ సరిహద్దులను వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియే, యూఏఈ నుంచి నిధులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. చంగూర్ బాబాకు సంబంధించి బలరామ్‌పుర్‌లోని భారీ ఇంటిని ఇప్పటికే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. ఈ భవనంలో దాదాపు 70 గదులు ఉన్నాయని అధికారులు చెప్పారు. వీటిల్లో 40ని కూలగొట్టారు. చంగూర్‌బాబా 15 ఏళ్లుగా మతమార్పిడి రాకెట్‌ను వివిధ రూపాల్లో నిర్వహిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.
జూలై 5న, మత మార్పిడి ముఠాకు సూత్రధారిగా భావిస్తున్న ఛంగూర్ బాబాను, అతని సహాయకురాలు నీతు అలియాస్ నస్రీన్‌తో పాటు అరెస్టు చేశారు. 16 ఏళ్ల బాలిక తాను కూడా బాధితుల్లో ఒకరిని అని ఆరోపించింది. ప్రేమ పేరుతో తన ఇంటి సమీపంలో ఉండే అమీర్ హుస్సేన్ తనను ట్రాప్ చేసినట్లు చెప్పింది. అతడి సోదరి నేహాఖాన్ ద్వారా హుస్సేన్‌ని కలిసినట్లు వెల్లడించింది. తనను దర్గాకు తీసుకెళ్లి, ఛంగూర్ బాబాకు పరిచయం చేసినట్లు వెల్లడించింది. ఇస్లాంలోకి మారి హుస్సేన్‌ను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు చెప్పింది.