Shivamogga Jail: జైలుకు సరఫరా చేసే అరటి గెలల్లో సిగరెట్లు, గంజాయి.
అధికారుల తనిఖీలో బయటపడ్డ సిగరెట్ ప్యాకెట్లు, డ్రగ్స్
ఖైదీలకు పంచేందుకు తెప్పించిన అరటి పళ్లలో డ్రగ్స్ బయటపడడంతో కర్ణాటకలోని శివమొగ్గ జైలులో కలకలం రేగింది. తనిఖీలో అరటి గెలల్లో నీట్ గా ప్యాక్ చేసిన వస్తువులు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే అధికారులు నివ్వెరపోయారు. జైలులోని క్యాంటీన్ కేంద్రంగా ఈ దందా కొనసాగుతోందని గుర్తించి బాధ్యులైన అధికారులను గుర్తించేందుకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అసలేం జరిగిందంటే..
జైలులోని ఖైదీలకు అవసరమయ్యే పండ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ శివమొగ్గ జైలుకు ఓ ఆటోలో అరటి పండ్లను పంపించాడు. ఆటో డ్రైవర్ వాటిని తీసుకొచ్చి జైలు గేటు ముందు దింపి వెళ్లాడు. అరటి గెలలను పరిశీలించిన సెక్యూరిటీ సిబ్బంది.. గెలల కాండం వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో తొలచి చూశారు. అందులో నుంచి టేప్ తో చుట్టి నీట్ గా ప్యాక్ చేసిన గంజాయి, సిగరెట్లు బయటపడ్డాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్న గార్డులు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జైలు అధికారుల ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలోనూ ఈ జైలులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. డబ్బు చెల్లించాలే కానీ ఖైదీలకు మందు, సిగరెట్లు, డ్రగ్స్.. ఇలా ఏది కావాలన్నా తెప్పించుకునే అవకాశం ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.