Conductor Arrest : మహిళా ప్రయాణికురాలిపై దాడి.. బస్సు కండక్టర్ అరెస్ట్
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC)కి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలిపై దాడికి పాల్పడిన బస్సు కండక్టర్‌ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన కండక్టర్‌ను హొన్నప్ప నాగప్ప అగసర్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున బిలేకహళ్లి నుంచి శివాజీనగర్‌కు బీఎంటీసీ బస్సులో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని బాధితురాలు 24 ఏళ్ల తాంజులా ఇస్మాయిల్ పీర్జాదే తన ఫిర్యాదులో పేర్కొంది.
తాను పలుమార్లు కోరినప్పటికీ కండక్టర్ టికెట్ ఇవ్వడానికి నిరాకరించాడని తంజులా చెప్పింది. “తర్వాత, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ దగ్గర బస్సును ఆపమని నేను డ్రైవర్‌ను అభ్యర్థించాను… కండక్టర్ నా దగ్గరకు వచ్చి, దుర్భాషలాడాడు, నాపై చెయ్యి వేశాడు. నా జుట్టు లాగి, నన్ను చెంపదెబ్బ కొట్టాడు. నేను నా మొబైల్ ఫోన్‌లో ఈ సంఘటనను రికార్డ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, అతను దాన్ని నా నుండి లాక్కొని విసిరేశాడు”అని ఫిర్యాదుదారు చెప్పారు. కండక్టర్ కూడా తనను బెదిరించాడని తంజులా పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన కండక్టర్‌ను అరెస్టు చేశారు. అయితే, నిందితులు ఈ ఘటనకు సంబంధించి భిన్నమైన కథనాన్ని పంచుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.
బాధితురాలికి ఫ్రీ టికెట్ ఇప్పించేందుకు ఆధార్ కార్డును అడిగానని కండక్టర్ తెలిపారు. అయితే రెండు సార్లు ఆగినా ఆమె ఆధార్ కార్డు చూపలేదు. "ఆధార్ కార్డ్ చూపించమని లేదా టికెట్ కొనమని నేను ఆమెను అభ్యర్థించినప్పుడు, ఆ మహిళ కోపంతో వాగ్వాదానికి దిగింది. మొదట అతన్ని చెంపదెబ్బ కొట్టింది" అని నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్లు 354, 323, 506, 509 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు, బాధితురాలి వాంగ్మూలాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.