Parliament : రాష్ట్రపతిని అంత మాట అంటారా... కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ బీజేపీ
Parliament : రాష్ట్రపతిపై విమర్శల వివాదం పార్లమెంట్ ఉభయసభల్ని కుదిపేస్తోంది;
Loksabha : రాష్ట్రపతిపై విమర్శల వివాదం పార్లమెంట్ ఉభయసభల్ని కుదిపేస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ ఎంపీ అథిర్ రంజన్ చౌదరి అవమానించారంటూ.. క్షమాపణకు డిమాండ్ చేశారు కేంద్రమంత్రులు. లోక్‌సభలో స్మృతిఇరానీ, రాజ్యసభలో నిర్మలసీతారామన్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ, దళిత విరోధి అంటూ స్మతి ఇరానీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రపతి పదవిలో తోలుబొమ్మను కూర్చోబెట్టారంటూ మాట్లాడడం దారుణమన్నారు. రాష్ట్రపత్ని అంటూ ముర్మును ఉద్దేశించి అథిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. అవి నాలుక తడబడిన మాటలు కాదు.. ఉద్దేశపూర్వకమేనంటూ నిర్మలాసీతారామన్ రాజ్యసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతిపై ఈ స్థాయిలో విమర్శలు సోనియా ఆదేశాలతోనే జరిగాయని స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఆదివాసీలకు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు.
అటు, తన వ్యాఖ్యల వివాదంపై ఎంపీ అథిర్ రంజన్ చౌదరి స్పందించారు. పొరపాటునే రాష్ట్రపత్ని అనే మాట వచ్చిందని వివరించారు. నిన్నటి నుంచి రాష్ట్రపతిని ద్రౌపది ముర్మును కలిసేందుకు ట్రై చేస్తున్నా ఏదో రూపంలో కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. పార్లమెంట్ బయట విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు.