ఫ్రీ ఫ్రూటీకి కక్కుర్తి పడి కటాకటాల పాలైన డాకూ హసీనా
పది రూపాయల ఫ్రూటీ ఎర వేసి 9 కోట్లు చోరీ చేసిన మహిళను పట్టుకున్న పోలీసులు;
ఫ్రీ ఆఫర్ ఉందంటే చాలు చాలామందికి అవసరం లేని వస్తువు కూడా అవసరమైనదిగానే కనిపిస్తుంది. ఈ విషయంలో ఆడవాళ్ళకి ఇంకా ప్రత్యేకమైన పేరు ఉంది. ఆ రకంగానే చీర కొంటె చీర ఫ్రీ ఆఫర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరబూస్తోంది. ఇక కొన్నిదగ్గర్ల ఫ్రీగా దొరికే వాటర్ ప్యాకెట్ లు, కూల్ డ్రింక్ లు, మజ్జిగలు కూడ వదిలిపెట్టరు కొందరు. తాజాగా పంజాబ్‌లో రూ. 8 కోట్లు కొట్టేసి, పరారైన ఒక మహిళ ఫ్రీ ఫ్రూటీకి కక్కుర్తి పడి పోలీసులకు చిక్కిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పంజాబ్‌లోని లుథియానాలో సుమారు 9 కోట్లు చోరీ చేసిన మాస్టర్‌మైండ్ డాకూ హసీనా అలియాస్ మన్‌దీప్ కౌర్ ఉరఫ్ మోనాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఆ సమయంలో ఉత్తరాఖండ్‌లోని చమేలీలో గల హేమకుండ్ సాహిబ్‌కు మొక్కుతీర్చుకునేందుకు భర్తతో పాటు వెళుతోంది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం మన్‌దీప్ కౌర్ దంపతులు నేపాల్ మార్గంలో విదేశాలకు పారిపోవచ్చని తెలిసింది. లుక్‌అవుట్ నోటీస్ జారీ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు ‘ఫ్రీ ఫ్రూటీ సర్వీస్’ పేరుతో వలపన్ని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఏంటి ఈ ‘ఫ్రీ ఫ్రూటీ సర్వీస్’
లూథియానాలో దోపిడీ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా సిక్కు మందిరాన్ని సందర్శించాలని ప్రయాణమయ్యారు మన్‌దీప్ కౌర్ దంపతులు. అయితే సిక్కు మందిరాల దగ్గర మహిళలైనా, పురుషులైనా తమ జుట్టును కవర్ చేసుకుంటారు. సిక్కులు పగిడీలు పెట్టుకుంటే పురుషులు కనీసం రుమాలైనా కట్టుకుంటారు. ఇక మహిళలందరూ చున్నీలు కప్పుకోవడం చేస్తారు. ఇంకా కరోనా భయం కూడా పూర్తిగా పోలేదు కాబట్టి మాస్కులు కూడా పెట్టుకోవచ్చు. అలా ఉన్నప్పుడు మన్‌దీప్ కౌర్ ని గుర్తించి పట్టుకోవడం అసాధ్యం. దీంతో యాత్రికుల కోసం ఉచితంగా డ్రింక్ సర్వీస్ ఏర్పాటు చేయాలని పోలీసులు ప్లాన్ చేశారు. డ్రింక్ తాగడానికి వచ్చిన నిందితులు ముఖానికి ఉన్న మాస్కులు తీయక తప్పలేదు. వారిని గుర్తించిన పోలీసులు వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులను సైతం అరెస్ట్ చేసారు.
మాస్టర్ మైండ్ మన్‌దీప్ కౌర్ చేసిన చోరీ ఏంటంటే
జూన్ 10న రాత్రి, ఆయుధాలు ధరించిన కొంతమంది లుథియానాలోని న్యూ రాజ్‌గురు నగర్ ప్రాంతంలో సిఎంఎస్ సెక్యూరిటీస్‌కు చెందిన ఒక క్యాష్ వ్యాన్‌ను చోరీ చేశారు. ఇందులో రూ. 8 కోట్ల 49 లక్షలు ఉన్నాయి. తరువాత లుథియానాకు 20 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన పోలీసులకు ఈ క్యాష్ వ్యాన్ కనిపించింది. దానిని స్వాధీనం చేసుకున్నారు. తరువాత సైబర్ టీమ్ సహాయం తీసుకుని, వ్యాన్ జీపీఎస్‌ను ట్రాక్ చేశారు. నిందితులు వినియోగిస్తున్న మొబైల్ టవర్ డిటైల్స్ కూడా లభ్యమయ్యాయి. వీటన్నింటి సహాయంతో పోలీసులు ఐదుగురు నిందితులను వెంటనే పట్టుకోగలిగారు. వారి దగ్గర నుంచి రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్లాన్ చేసిన మాస్టర్‌మైండ్ మన్‌దీప్ కౌర్ తన భర్త, మరో ఐదుగురుతో పాటు పరారయ్యింది. పోలీసులు మన్‌దీప్ కౌర్ మూమెంట్స్‌ను ట్రాక్ చేస్తూ వచ్చారు. చివరికి వారిని హేమకుండ్‌లో అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం నిందితులు 12 మంది కాగా పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. రూ. 5 కోట్ల 96 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.