Uttarkashi: ఉత్తరాఖండ్‌లో మరో వరద భయం!
రెస్క్యూ ఆపరేషన్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు..;
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా ధరాలీ గ్రామాన్ని వరద ప్రవాహాం ముంచెత్తింది. మంగళవారం నాడు మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. క్లౌడ్‌బరస్ట్ దెబ్బకు అతి వేగంగా దూసుకొచ్చిన ఖీర్ గంగానది దారిలో ఉన్న చెట్టు, చేమ, బురద, కొండచరియలను కలుపుకుని రావడంతో గ్రామంలోని ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు ఒక్కసారిగా పేకమేడల్లా నేలకూలిపోయాయి. జలప్రళయం నుంచి తప్పించుకునేందుకు.. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. పరుగులు తీసిన ఫలితం లేకుండా పోయింది. కళ్లుమూసి తెరిచేలోపే వరద బురద వారిని ముంచెత్తిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విలయంలో ఇప్పటిదాకా 12 మంది మృతదేహాలు లభించాయి.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
అయితే, ఉత్తరాఖండ్ లో నేడు (ఆగస్టు 6న) విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న విధ్వంసం జరిగిన ప్రదేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కార్యక్రమాల్లో ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమైయ్యాయి. కాగా, మరోసారి భగీరథి నది ప్రవాహాన్ని ఖీర్ గంగ ప్రాంతంలో వచ్చిన బురద, కొండచరియలు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. కాగా, ఉత్తరకాశీ జిల్లాలో మరికొన్ని గ్రామాలకు మరో పెను ప్రమాదం పొంచి ఉంది.