Delhi Suicide Bomber: ఢిల్లీ సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫోటో రిలీజ్
ఎన్ఐఏ, ఐబీలతో సంయుక్త దర్యాప్తునకు కీలక ఆదేశాలు
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నిన్న జరిగిన కారు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 9 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఉదయం 11 గంటలకు కర్తవ్య భవన్‌లో ఉన్నతస్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ఈ కీలక సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ తపన్ కుమార్ డేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ దాఠే హాజరుకానున్నారు. జమ్మూకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ వర్చువల్‌గా పాల్గొంటారు.
సోమవారం రాత్రి పేలుడు జరిగిన వెంటనే అమిత్ షా రంగంలోకి దిగారు. రాత్రి 9:45 గంటల సమయంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్దకు చేరుకుని, పూర్తిగా కాలిపోయిన కారును పరిశీలించారు. అనంతరం లోక్‌నాయక్ జయప్రకాశ్ (ఎల్‌ఎన్‌జేపీ) ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. గాయపడిన 12 ఏళ్ల బాలుడు, టాక్సీ డ్రైవర్ సహా పలువురితో దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
మరోవైపు ఈ పేలుడుకు కొన్ని గంటల ముందే జమ్మూకశ్మీర్ పోలీసులు ఢిల్లీకి సమీపంలోని హర్యానాలోని ఫరీదాబాద్‌లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేయడం గమనార్హం. జైషే మహమ్మద్ (జెఈఎం), అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఏడుగురు ముష్కరులను అరెస్టు చేశారు. వారి నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలు, రెండు ఏకే రైఫిళ్లు, పిస్టళ్లు, టైమర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో ఎన్‌ఎస్‌జీ కమాండోలను మోహరించారు. దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని కూడా విడిచిపెట్టవద్దని, ఎన్ఐఏ, ఐబీ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కలిసి పనిచేయాలని అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, ముంబై నగరాల్లో హై అలర్ట్ ప్రకటించి, రద్దీ ప్రదేశాలు, ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను పెంచారు.