Delhi CM: ఢిల్లీలో ఈ నెల 19 లేదా 20న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..?
ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ కొత్త సీఎం ఎంపిక;
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై వారం రోజులు పూర్తయింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం పాలైంది. బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఫలితాలు వెలువడి వారం రోజులైనా సీఎం ఎవరనే విషయాన్ని బీజేపీ ఇంకా తేల్చలేదు. కొత్త ప్రభుత్వం ( ఎప్పుడు కొలువుదీరబోతోందనే విషయంలో కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన ప్రకారం.. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ఏదో ఒకరోజు కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్, అమెరికా పర్యటనలు ముగించుకుని శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతారు. ప్రధాని ఢిల్లీకి రాగానే హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ బీజేపీ నేతలతో సమావేశమై ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గం కూర్పుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అనంతరం లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది. ఫిబ్రవరి 17న గానీ, 18న గానీ బీజేపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. తమ నాయకుడిని ఎన్నుకోనుంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ తరఫున గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో 15 మంది పేర్లను బీజేపీ ఇప్పటికే షార్ట్ లిస్టు చేసినట్లు తెలుస్తోంది. వారిలో 9 మందిని సీఎం, అసెంబ్లీ స్పీకర్, క్యాబినెట్ స్థానాలకు ఎంపిక చేయనుంది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ సీఎం రేసులో మొదటి స్థానంలో ఉన్నారు. తక్కిన వారిలో పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ, బన్సూరి స్వరాజ్, సతీష్ ఉపాధ్యాయ్ తదితరులు ఉన్నారు.
ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను 48 స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. మరోసారి అధికారంలోకి రావాలనుకున్న ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది. . కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి అగ్ర నేతలంతా ఈ సారి ఓడిపోయారు. ఒక్క అతిషి మాత్రం కల్కాజ్ నియోజకవర్గం నుంచి అతి కష్టం మీద గట్టెక్కారు.ఇక కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా కనీసం ఖాతా తెరువలేకపోయింది.