Delhi Air Pollution : ఢిల్లీని కమ్మేస్తున్న కాలుష్యం..
రోజురోజుకి క్షీణిస్తున్న గాలి నాణ్యత..;
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ తీవ్రమైన కేటగిరీలో ఉండగా గాలి నాణ్యత రోజురోజుకు మరింత పడిపోతోంది. ప్రస్తుతం ఢిల్లీలో సగటు ఏక్యూఐ రీడింగ్ 412గా ఉంది. పగటి పూట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గరిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఢిల్లీలోని అలీ పూర్, ఆనంద్ విహార్, అశోక్ విహార్, బవానా ప్రాంతాలు తీవ్రమైన కాలుష్యంలో ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. అలాగే చాందిని చౌక్, డీటీయు, ద్వారక, జహంగీర్ పురి, మందిర్ మార్గ్ లు కూడా అదే కోవలో ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ విధంగా దాదాపు 20 మానిటరింగ్ స్టేషన్లు 400లకు పైగా ఏక్యూఐ రీడింగ్ లను నమోదు చేశాయని తెలిపింది.
ఢిల్లీలోని గాలి నాణ్యత తీవ్రమైన క్యాటగిరీకి పడిపోయిన తర్వాత వాయు కాలుష్యం నుంచి ఉపశమనం లభించలేదు. ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్యం ప్రమాదకర రేట్ల మధ్య నోయిడాలోని అన్ని స్కూల్స్ లో నవంబర్ 27వ తేదీ వరకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. అలాగే ఢిల్లీలోని ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్ లైన్ లోనే తరగతులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కాలుష్య నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేస్తున్నారు అక్కడి అధికారులు. ప్రస్తుతం ఢిల్లీలో గ్రాప్ 4 (GRAP 4) ఆంక్షలు విధించారు. ఢిల్లీలో ఇవాళ గాలి నాణ్యత చాలా తీవ్రంగా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. దేశ రాజధానిలో పెరుగుతున్న తీవ్రమైన వాయు కాలుష్యంతో వృద్ధులు, చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధ సమస్యలు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
తీవ్రమైన వాయు కాలుష్యానికి అధికంగా గురి కావడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చని నిపుణులు హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో చెత్త వ్యర్ధాలను దహనం చేయడం కూడా కాలుష్యం పెరగడానికి మరో ముఖ్యమైన కారణంగా కనిపిస్తోంది.