Delhi: ఢిల్లీలో 52.3 డిగ్రీలు

దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత;

Update: 2024-05-30 02:33 GMT

దేశ రాజధానిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేష్‌పుర్‌ ప్రాంతంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎండలు భారీగా పెరగడంతో.. విద్యుత్‌ డిమాండ్‌ బాగా పెరిగింది. దిల్లీ చరిత్రలోనే 8వేల 302 మెగావాట్ల మార్కును దాటడం తొలిసారని డిస్కం అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో దిల్లీలో పలుచోట్ల తాగునీటి కొరత ఏర్పడింది. నీటిని వృథా చేస్తే 2వేల రూపాయల జరిమానా విధించనున్నట్లు మంత్రి అతిశీ పేర్కొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఠారేత్తిస్తున్నాయి. దిల్లీలోని పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేష్‌పుర్‌ ప్రాంతంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారంతో పోలిస్తే... ఒక్కరోజులోనే 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపారు. దిల్లీ చరిత్రలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవడం ఎప్పుడూ లేదని భారత వాతావరణశాఖ వెల్లడించింది. రాజస్థాన్‌ నుంచి వచ్చే వేడి గాలులు వల్ల.. దిల్లీ నగర శివారు ప్రాంతాలు ముంగేష్‌పుర్‌, నరేలా, నజాఫ్‌గఢ్‌లలో ఉష్ణోగ్రతలు పెరిగాయని.. IMD అధికారులు స్పష్టంచేశారు. నిర్మానుష్య ప్రదేశాల్లో రేడియేషన్‌, సూర్య కాంతి నేరుగా పడే ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో.. దిల్లీలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగింది. బుధవారం మధ్యాహ్నం వరకు 8వేల 302 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉందని డిస్కం అధికారులు వెల్లడించారు. 8వేల 300మెగావాట్ల మార్కును దాటడం దిల్లీ చరిత్రలోనే మొదటిసారని పేర్కొన్నారు. 

ఢిల్లీలో ఎండల తీవ్రతతో పలుచోట్ల తాగునీటి కొరత ఏర్పడింది. నీటి కొరతను అధిగమించేందుకు దిల్లీ ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. ఎవరైనా నీటిని వృథా చేస్తే 2వేల రూపాయల జరిమానా విధించనున్నట్లు దిల్లీ మంత్రి అతిశీ తెలిపారు. నీటి పైపులతో కార్లను కడగడం, వాణిజ్యపరమైన అవసరాల కోసం వినియోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఇందుకోసం దిల్లీ వ్యాప్తంగా 200 బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. మే 30న ఉదయం 8గంటల నుంచి ఈ బృందాల్ని రంగంలోకి దించేలా చర్యలు చేపట్టాలని దిల్లీ జల్‌బోర్డు సీఈవోకు రాసిన లేఖలో అతిశీ పేర్కొన్నారు. నిర్మాణ స్థలాలు, వాణిజ్య సంస్థల్లో ఏవైనా అక్రమ నీటి కనెక్షన్లు ఉంటే తొలగించాలని అధికారుల్ని ఆదేశించారు. దిల్లీలో ఉన్న నీటి వనరుల్ని పొదుపుగా వాడుకోవడంపై దృష్టిసారించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 

రాజస్థాన్, పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తో సహా అనేక ప్రాంతాలకు భారత వాతావరణశాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఈ హీట్‌ వేవ్‌తో అన్ని వయసుల వారు అనారోగ్యం, వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు హెచ్చరికలు చేసింది. ఢిల్లీ మాదిరిగానే వేడి గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది.ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లోని ఫలొదిలో 51 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది

Tags:    

Similar News