ఢిల్లీలో కుండపోత... 20 ఏళ్లలో ఫస్ట్ టైమ్
దేశ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షం.... చెరువులను తలపించిన రహదారులు... ఎల్లో అలర్జ్ జారీ చేసిన అధికారులు;
దేశ రాజధాని ఢిల్లీని కుండపోత వర్షం ముంచెత్తింది. గత 20 ఏళ్లలో గరిష్ట వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఢిల్లీలో 2003 జూలై 10 తర్వాత 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం. 2003 జూలై 10న 133.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, శనివారం 126.1 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. 1958 జూలై 21న 266.2 మిల్లీమీటర్ల ఆల్ టైం రికార్డు వర్షపాతం నమోదైంది. ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో భారీ వర్షం కురవడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది. నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో అధికారులు ఎల్లో అలర్ట్‌ను కొనసాగించనున్నారు.
భారీ వర్షంతో ఢిల్లీ నగర వీధులన్నీ జలమయం అయ్యాయి. భారీగా చెట్లు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్ల మీద భారీగా వదర నీరు చేరడంతో మింట్ బ్రిడ్జ్ ప్రాంతంలో అండర్ పాస్‌ను అధికారులు మూసివేశారు. ఇండియా గేట్, ప్రగతి మైదాన్, నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అత్యంత రద్దీగా ఉండే కన్నౌట్ ప్యాలెస్‌లోకి భారీగా వర్షపు నీరు చేరింది.
కేరళలోని అలప్పుజా, ఎర్నాకుళం, మలప్పురం, ఇతర దక్షిణ జిల్లాల్లో వారం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వానల ధాటికి 19 మంది ప్రాణాలు కోల్పోగా 10 వేల మందిని పైగా సహాయక శిబిరాలకు తరలించారు. 11 వందల ఇళ్లు దెబ్బతిన్నాయి. రాజస్థాన్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. 24 గంటల్లో చిత్తోర్‌గఢ్, సవాయ్ మాధోపూర్‌లలో నలుగురు మరణించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోనూ కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కసౌలి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంతో పాటు మరో రెండు భవనాలపై కొండచరియలు పడటంతో దెబ్బతిన్నాయి. అప్రమత్తమైన అధికారులు సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలు పడుతున్నప్పుడు కొండపై నుంచి నిరంతరం రాళ్లు పడుతున్నాయని జాగ్రత్త ఉండాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాకాలం మొదలైన నాటి నుంచి కొండచరియలు పడటం వంటి ప్రమాదాల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. 352 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.
నాలుగు, ఐదు రోజుల్లో జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.