Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో మరో రెండు కార్లు ..

ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు స్వాధీనం.. ఎక్కడ దొరికిందంటే..

Update: 2025-11-13 02:45 GMT

 ఢిల్లీ ఉగ్రదాడిపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ దర్యాప్తులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కేవలం i20 లేదా EcoSport కార్లను మాత్రమే కాకుండా, మరో రెండు పాత వాహనాలను పేలుడు పదార్థాలతో నింపడానికి సిద్ధమయ్యారు. అనేక ప్రదేశాల్లో దాడులు నిర్వహించడానికి వీలుగా అదనపు వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ సమాచారాన్ని అనుసరించి, ఏజెన్సీలు ఇప్పుడు ఈ అదనపు వాహనాల ఎక్కడ నుంచి తీసుకోవాలనుకున్నారు. వాటిని ఎక్కడ తయారు చేస్తున్నారు. వాటిని ఎవరు సేకరించారు. అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నాయి. నిఘా సంస్థ వర్గాల ప్రకారం.. ఉగ్రవాదులు భారీ దాడులకు యత్నించారు. ఈ ఉగ్రముఠా నెట్‌వర్క్‌పై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఉగ్రవాదులు ఐ20 కారుతో పాటు మరో ఎరుపు రంగు కారును కూడా వినియోగించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో ఢిల్లీలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ పోస్టులు, సరిహద్దు చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు DL10CK0458 ఉమర్ ఉన్ నబి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఈ కారును ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ RTOలో నవంబర్ 22, 2017న రిజిస్టర్ చేశారు. ఉమర్ ఈశాన్య ఢిల్లీలో నకిలీ చిరునామాను ఉపయోగించి వాహనాన్ని కొనుగోలు చేశాడని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు అర్థరాత్రి ఆ ప్రదేశంలో తనిఖీలు నిర్వహించారు.

ప్రజల భద్రతను నిర్ధారించడానికి కారుకు 200 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న మొత్తం ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది చుట్టుముట్టారని పోలీసులు తెలిపారు. వాహనం తనిఖీ తర్వాత, తదుపరి ఫోరెన్సిక్ పరీక్ష, దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వాహనాన్ని స్వాధీనం చేసుకోనుంది. 

మరోవైపు.. ఎర్రకోట పేలుళ్ల కేసు, ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్ దర్యాప్తు ఇప్పుడు కశ్మీర్‌కు చేరుకుంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ (CIK), పోలీసుల సంయుక్త బృందాలు లోయ అంతటా 15 వేర్వేరు ప్రదేశాలలో దాడులు చేశాయి. ఖాజీగుండ్‌లో జరిగిన దాడిలో డాక్టర్ వహీద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఫరీదాబాద్ మాడ్యూల్‌తో అనుసంధానించబడిన అనుమానిత నెట్‌వర్క్‌పై దర్యాప్తులో భాగంగా ఈ చర్య తీసుకున్నారు.

Tags:    

Similar News