Supriya Sule: మా నాన్నను ఏమైనా అన్నారో...ఖబర్ధార్..!

శరద్‌ పవార్‌ రిటైర్‌ అవ్వాలన్న అజిత్‌ సూచనపై మండిపడ్డ సుప్రియా సూలె... మా నాన్న గురించి అమర్యాదగా మాట్లాడితే సహించబోమని హెచ్చరిక

Update: 2023-07-06 03:15 GMT

మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతూ వస్తోన్న శరద్‌ పవార్‌కు వయసు మీద పడిందని... ఆయన తప్పుకోవాలని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఘాటుగా సమాధానమిచ్చారు. అమితాబ్ బచ్చన్ వయసు 82 ఏళ్ళని.. ఇప్పటికీ ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. మీకోపం మాపైనే కాబట్టి మమ్మల్ని తిట్టినా సహిస్తామమని... కానీ మా నాన్న గారిని అమర్యాదగా మాట్లాడితే మాత్రం సహించబోమని సుప్రియా హెచ్చరించారు.


ఎదుటివారి వయసు పెరిగింది మమ్మల్ని ఆశీర్వదించమని అడిగే ముందు అసలెందుకు ఆశీర్వదించాలో ప్రశ్నించుకోవాలని అజిత్‌ పవార్‌కు సుప్రియా సూలే హితవు పలికారు. రతన్ టాటా సాహెబ్ కంటే కేవలం మూడేళ్లే పెద్దవారు. అయినా దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించడంలేదా అని నిలదీశారు. అవినీతిని పెంచి పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వంపైనే తమ పోరాటమని ఆమె స్పష్టం చేశారు. అసలైన ఎన్సీపీ పార్టీ శరద్ పవార్ తోనే ఉందని తమ గుర్తు తమతోనే ఉంటుందని తెలిపారు.

రిటైర్‌ కావాలంటూ సూచించిన అబ్బాయి అజిత్‌కి శరద్‌ పవార్‌ కూడా గట్టిగానే బదులిచ్చారు. తన ఫోటో లేకుండా ఏ పనిచేయలేవని అజిత్‌ను ఎద్దేవా చేశారు. అజిత్ పవార్ నిర్వహించిన సమావేశంలో తనదే అతిపెద్ద ఫోటో ఉందన్నారు. అజిత్‌ పవార్‌కు... ఏదైనా సమస్య ఉంటే తనతో మాట్లాడాలని సూచించారు. వేరుపడాలనుకునే ఎమ్మెల్యేలను పరిగణనలోకి తీసుకునేదిలేదన్నారు. ఎలాంటి పద్దతులను అజిత్ వర్గం పాటించలేదని శరద్‌ పవార్ మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం వరకూ ఏక్‌నాథ్‌శిందే లాంటి సీఎంను ఎప్పుడూచూడలేదని విమర్శించిన అజిత్ పవార్‌ ఇప్పుడు ఎందుకు ఆయన పంచన చేరారని శరద్‌ పవార్ ప్రశ్నించారు. ఎన్సీపీని అవినీతి పార్టీగా అభివర్ణించిన భాజపా ఇప్పుడు అదే పార్టీ నేతలను ఎందుకు ప్రభుత్వంలో చేర్చుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News